CM Revanth Reddy: వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు.. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు కానీ వరద బాధితులను పరామర్శించరని కేటీఆర్ పై సీఎం విమర్శలు గుప్పించారు.

Update: 2024-09-02 11:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వరదల్లో బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్‌లో పోస్టు పెడుతున్నాడని, ఒకాయన ఫాంహౌస్‌లో ఉన్నాడని సీఎం బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి విమర్శించారు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దని సూచించారు. బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు కానీ వరద బాధితులను పరామర్శించరని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా మోతె గ్రామంలో సీఎం పర్యటించారు. సూర్యాపేట జిల్లాలో వరదల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ తెగిపోవడం వల్ల జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు.

వరద నష్టం రూ.5 వేల కోట్లు:

రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఇప్పటివరకు రూ. 5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసినట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేల కోట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆర్థికసాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.

ఇళ్లు కోల్పోయినవారికి ఇందిరమ్మ ఇళ్లు..

ప్రజలను తక్షణం ఆదుకునేలా జిల్లా కలెక్టర్‌కు రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్.. పశువులు కోల్పోయినవారికి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని, అందువల్లే నష్టం తగ్గిందన్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని వరద బీభత్సాన్ని ప్రధానికి వివరించామని తెలిపారు. రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీతోపాటు పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి సైతం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్ల కే నిర్ణయాధికారం ఇచ్చామని చెప్పారు.


Similar News