రాష్ట్ర కేబినేట్‌లో నగరానికి దక్కని చోటు.. ఎమ్మెల్సీ పదవి కోసం పావులు

గ్రేటర్ హైదరాబాద్, ఇది తెలంగాణ గుండెకాయ.

Update: 2023-12-08 03:09 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్, ఇది తెలంగాణ గుండెకాయ. తరచుగా దేశ రెండవ రాజధానిగా చేయాలని డిమాండ్ వినబడే నగరం. ఇంతటి ఖ్యాతి ఉన్న హైదరాబాద్ జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు పలు మంత్రి పదవులు దక్కాయి.

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఒక్క హైదరాబాద్ జిల్లానే కాదు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో రాష్ట్ర నూతన మంత్రివర్గంలో జిల్లాకు చోటులేకుండా పోయింది. గత ప్రభుత్వంలో జిల్లా మంత్రులుగా తలసాని, మహమూద్ అలీ ఉన్న విషయం తెలిసిందే. అయితే మహమూద్ అలీ ఎమ్మెల్సీగా ఉండి పదవిని దక్కించుకోగా సనత్‌నగర్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గత మంత్రివర్గంలో కీలకంగా పని చేశారు.

విస్తరణలో అవకాశం దక్కేనా..

రాష్ట్ర మంత్రివర్గంలో మరో 7 మంది వరకు మంత్రులుగా రెండవ విడత పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే అందులో కూడా హైదరాబాద్ జిల్లాకు చోటుదక్కే అవకాశం కనబడడం లేదు. అధికారంలో ఉన్న పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసలు ప్రాతినిధ్యం లేకుండాపోవడం ఇదే మొదటిసారి కాగా ఇది అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా గ్రేటర్‌ హైదరాబాద్‌కు కీలక ప్రాధాన్యత ఉండేది. 2018 ఎన్నికల్లో ఏకంగా బీఆర్ఎస్ పద్నాలుగు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. దీంతో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కానీ మొదటిసారిగా తాజా ఎన్నికల్లో అధికార పార్టీకి గ్రేటర్‌ పరిధిలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు ఎమ్మెల్సీలు కూడా లేకుండాపోయారు. దీంతో మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఓటమిపాలైన అగ్ర నేతలు..

గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీ చేసిన మధుయాష్కిగౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, డాక్టర్ రోహిన్‌రెడ్డి, మహ్మద్ అజారుద్ధీన్, విజయారెడ్డి, ఆదం సంతోష్‌కుమార్, పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, ఫిరోజ్ ఖాన్, మైనంపల్లి హన్మంతరావు వంటి పెద్ద నాయకులు ఓటమిపాలయ్యారు. వీరిలో ఎవరు గెలిచినా మంత్రి పదవీ దక్కిఉండేదనే టాక్ అంతటా వినబడుతోంది.

సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం కల్పించేలా అధికార పార్టీ సమీకరణాలు ఉంటాయి. రాష్ట్రంలో కనీసం ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి ప్రాతినిధ్యం చోటు దక్కుతుంది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల ఫలితాల్లో అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి మాత్రం లేకపోవడంతో మంత్రివర్గంలో ఆ లోటును ఎలా భర్తీ చేస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది.

ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారా..?

ఎమ్మెల్యేగా గెలుపొందని నాయకులను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లయితే ఆరు నెలల్లో ఏదో ఒకస్థానం నుంచి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. గతంలో పలువురు ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రి పదవులు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం గ్రేటర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కాలంటే కచ్చితంగా ఎమ్మెల్సీ కావాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠకు తెరలేపింది.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కానప్పటికీ మంత్రివర్గంలో చోటుదక్కితే ఆరు నెలల్లో ఏదో ఒక పదవికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అయితే ముందుగా మంత్రి పదవిని ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వాలని గ్రేటర్ నాయకులు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇటీవల ఎన్నికలలో పోటీ చేసిన నేతలు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.


Similar News