ప్రజలకు కేసీఆర్ మీద నమ్మకం పోయింది : వైఎస్.షర్మిల
పురుగులు పట్టిన బియ్యాన్ని రేషన్ ద్వారా ప్రజలకు అందజేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్సార్ టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల అన్నారు.
దిశ, బోధన్ : పురుగులు పట్టిన బియ్యాన్ని రేషన్ ద్వారా ప్రజలకు అందజేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్సార్ టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల అన్నారు. ఆదివారం ప్రజా ప్రస్థానం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా బోధన్ మండలంలోని పెంటాఖుర్ద్ గ్రామం నుంచి ప్రారంభించారు. సాలంపాడ్ గ్రామంలో దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటు నుంచి సాలంపాడ్, సాలురా క్యాంప్ మీదుగా బోధన్ పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్.షర్మిల మాట్లాడుతూ మునుగోడులో మంత్రి కేటీఆర్ అంటున్నాడు, గెలిపిస్తే మండలాన్ని దత్తత తీసుకుంటాం అని. గతంలో కొడంగల్ ఎన్నికల సందర్భంగా ఇదే మాట చెప్పారు. ఆ మాట ఏమయ్యింది కేటీఆర్ అక్కడ ఏం ఉద్ధరించారు అని ప్రశ్నించారు.
మీరు దత్తత తీసుకుంటే ఎంత...తీసుకోక పోతే ఎంత, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు ఉంది అని ఎద్దేవా చేశారు. అహంకారానికి, అధికార మదానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి, ఒక పార్టీ రాష్ట్రంలో.. ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందన్నారు. మీరు కొట్టుకుంటే ప్రజలకు ఏమొస్తుంది. ఉత్తి మాటలు, బూడిద తప్పా ఇంకోటి లేదు అని అన్నారు. ఏదో పెద్ద ఉద్ధరిస్తారు అన్నట్లు ఇప్పుడు దత్తత అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నియోజక వర్గాలు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్పా మరెక్కడయినా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు.
ఈ మూడు నియోజక వర్గాలకు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రి మిగతా వాళ్ళు ఏం పాపం చేశారన్నారు. అందరూ ఒట్లేస్తేనే కదా గెలిచింది. వందల కోట్లు మీ నియోజక వర్గాలకు మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ మూడు నియోజక వర్గాలు తప్పా...మిగతా తెలంగాణ మొత్తం పాకిస్థాన్ లో ఉందా...?..ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రతి పౌరుడి భాధ్యత మీదే కదా. మీకు ఏం హక్కు ఉండి మునుగోడు లో ఓటు అడుగుతున్నారన్నారు. మీ పాలన పై మీకు నమ్మకం ఉంటే ఎందుకింత ప్రచారం చేస్తున్నారన్నారు. మీ పాలన మీద మీకు నమ్మకం లేదా..అందుకే మీరు మళ్ళీ మళ్ళీ ప్రచారం చేస్తున్నారా అని అడిగారు.
మంచి బియ్యాన్ని ప్రజలకు, విద్యార్థులకు అందిస్తామన్న సీఎం కేసీఆర్ అన్న మాటను విస్మరించి ప్రజలకు, విద్యార్థులకు పురుగులు పట్టిన బియ్యాన్ని అందించడం సిగ్గుచేటన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని కాకుండా ప్రతి ఇంటి సామాగ్రిని అందించారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ సాధించుకుంటామంటూ రాష్ట్ర అభివృద్ధిని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను, సిలిండర్, ఆర్టీసీ చార్జీలను ఆకాశాన్ని పెంచి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సిలిండర్ రేటును పెంచినప్పటికీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తరపున భరిస్తూ ప్రజలకు తక్కువ ధరకే అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కిందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలన తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే వైఎస్ఆర్ టీపీ పార్టీని వచ్చే ఎన్నికలలో ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీపీ బోధన్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గౌతమ్ ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.