అభివృద్ధి చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ఆపేస్తా : వైఎస్ షర్మిల
బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధిని చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ఆపేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పీకర్ కు సవాల్ విసిరారు.
దిశ, కోటగిరి : బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధిని చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ఆపేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పీకర్ కు సవాల్ విసిరారు. 180వ రోజు చేరుకొని 2500కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకొని బాన్సువాడ నియోజకవర్గంలో కోటగిరి మండలం లింగాపూర్ చౌరస్తా నుండి పాదయాత్రగా వైఎస్ షర్మిల కోటగిరి మండల కేంద్రానికి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం బానిసవాడగా మారిందని, పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఉంటే ఆయన కొడుకులు ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారని ఆమె అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి చూపిస్తే ముక్క నేలకురాసి పాదయాత్ర ఆపేస్తానని స్పీకర్ కు సవాల్ విసిరింది.
ఒకవేళ నియోజకవర్గంలో సమస్యలు చూపిస్తే స్పీకర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించింది. ఇసుక మాఫియా కంకర మాఫియాలు చేస్తూ నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్ మెంటు ద్వారా ఎందరో నిరుపేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 40 లక్షల కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందిందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు కేసీఆర్ ఏం ఉద్ధరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఫామ్ హౌస్ కి పరిమితమవుతున్నారని, ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా చెల్లించని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తారని ఆమె ఫైరయ్యారు. అవకాశం కలిపిస్తే రాజన్న రాజ్యాన్ని మళ్లీ చూపిస్తామని ఆమె ప్రజలను వేడుకున్నారు. ఆమెవెంట తోట సుధాకర్, నీలం రమేష్, రామిరెడ్డి, తదితరులు ఉన్నారు.