మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పురుష ఉద్యోగులకు ఏమాత్రం తక్కువ కాకుండా మహిళా ఉద్యోగులు సైతం సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని టీఎన్జీవోఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించి, ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సన్మానానికి మహిళా ఉద్యోగులు నూటికి నూరు శాతం అర్హులని, మహిళా ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తూనే, మరోపక్క ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలను కూడా చక్కబెడుతున్నారని, మొత్తంగా చూస్తే 360 డిగ్రీల కోణంలో నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రతి తల్లి తమ పిల్లలను ఆడ, మగ అనే భేదం లేకుండా సమాన దృక్పధంతో సమ ప్రాధాన్యత చూపాలని హితవు పలికారు.
దీనివల్ల బాలికలు కూడా ధైర్యంగా ముందుకు సాగేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను అమలు చేస్తున్నాయని, వాటి గురించి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. మహిళా ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలూ కల్పించబడ్డాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యాలయాలలో, పని ప్రదేశాలలో ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని, మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్, జిల్లా సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్, డీడబ్ల్యూఓ రసూల్ బీ, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి శశికళ, మహిళా ఉద్యోగులు, టీఎన్జీవోల సంఘం ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.