కూరగాయలు కోస్తున్న భార్య..బయటకు వెళ్లిన భర్త..కట్ చేస్తే దారుణం

వ్యవసాయ పొలంలో కూరగాయలు కోస్తున్న మహిళను దారుణంగా కొట్టి చంపేశారు.

Update: 2024-11-20 16:19 GMT

దిశ, భిక్కనూరు :వ్యవసాయ పొలంలో కూరగాయలు కోస్తున్న మహిళను దారుణంగా కొట్టి చంపేశారు. ఏమాత్రం అనుమానం రాకుండా ప్రీ ప్లాన్ గా మర్డర్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచర్ల గ్రామంలో బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపింది. రాత్రి 9 గంటల వరకు కూడా పోలీసులు వివిధ కోణాల్లో అన్ని రకాలుగా ఎంక్వయిరీ చేస్తున్నప్పటికీ, ఏమాత్రం ఆనవాళ్లు దొరకకపోవడం పోలీసులకు సవాల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..బాలెముల సిద్ధ రాములు, తన భార్య సుగుణలు తన పొలంలో వేసిన కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య భర్తలిద్దరూ ఎప్పటి మాదిరిగానే ద్విచక్ర వాహనంపై వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. పాలకూర కోస్తుండగా నారు అయిపోవడంతో..అది తీసుకురావడానికి భర్త సిద్ధ రాములు వెళ్ళాడు. ఇదే సమయంలో పాలకూర కోస్తున్న సుగుణ(55)ను గుర్తు తెలియని దుండగులు తలపై దారుణంగా కొట్టి హతమార్చారు. అంతటితో ఊరుకోకుండా ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న భర్త వచ్చి చూసేసరికి రక్తపు మడుగుల్లో పడి ఉంది. దీంతో కుటుంబ సభ్యులకు బంధువులకు సమాచారం అందించారు.

వెంటనే కామారెడ్డి డిఎస్పీనాగేశ్వరరావు, భిక్కనూరు సిఐ సంపత్ కుమార్, ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఎంక్వయిరీ మొదలుపెట్టారు. బంగారం కోసమే అయితే హత్య చేసి ఉండరని, వేరే ఏమైనా కారణం ఉండవచ్చన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. మర్డర్ చేసిన స్థలంలో ఎలాంటి క్లూస్ దొరకకపోవడంతో ఘటనా స్థలానికి వేలిముద్ర నిపుణులను రప్పించారు. మర్డర్ చేయడానికి ఏమి వాడి ఉంటారన్న క్లూస్ కూడా దొరకకుండా మర్డర్ చేశారంటే, ప్రీ ప్లాన్ మర్డర్ ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు లోతుగా విచారణ సాగిస్తున్నారు. భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా..? లేక అన్యోన్యంగా ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, వారి మధ్య అలాంటివేమి లేవని, అన్యోన్యంగానే ఉంటారని గ్రామస్తులు వివరించారు. హత్య జరిగిన స్థలం సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ సి సి ఫుటేజ్ కోసం పోలీసులు వెయిట్ ఎదురు చూస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.


Similar News