పిండి తడిపి.... రొట్టె చేయాలే…

స్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన చిట్టి చేతులు... పిండి తడపడం... రొట్టెలు చేయడంతో పాటు, కూరగాయలు కోసి వంట చేసి పెట్టడమే కాకుండా, వడ్డించడం కూడా వారే చేసి పెడుతున్న వైనం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Update: 2024-02-19 14:24 GMT

 దిశ,భిక్కనూరు : పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన చిట్టి చేతులు... పిండి తడపడం... రొట్టెలు చేయడంతో పాటు, కూరగాయలు కోసి వంట చేసి పెట్టడమే కాకుండా, వడ్డించడం కూడా వారే చేసి పెడుతున్న వైనం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... పక్షం రోజుల క్రితం ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఒకరు, స్కూల్ ఇంచార్జ్ టార్చర్ భరించలేక, బీపీ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయం విధితమే. ఆ ఘటనను ఇంకా జిల్లా ప్రజలు మర్చిపోకముందే తాజాగా స్కూల్లో చదువుకునే విద్యార్థినులు సంఖ్య కనుగుణంగా పిండి తడుపుతూ రొట్టెలు చేసిస్తుండడం 300 మందికి వారం పది రోజులుగా వంటలు చేస్తూ వంట వాళ్ళుగా మారిన విద్యార్థినుల వీడియో క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్కూల్లో వంట మనుషులు ఉన్నప్పటికీ, చదువుకోవాల్సిన విద్యార్థినుల చేత ఇటువంటి వంట పనులు చేయించడం ఏమిటన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది. విద్యార్థినులను చదువుకొనివ్వకుండా వంట పనులకు పరిమితం చేయడం, ఈ విషయం ఏబీవీపీ ప్రతినిధుల వద్దకు చేరడం, వారు జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందన్న విమర్శలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. స్కూల్లో వరుసగా జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వెనక ఏమిటన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగామారింది. వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్స్ వారం రోజులవని కొందరు, ఏడాది కిందటివని మరికొందరు, చాలా పాతవని ఇంకొందరు చెబుతుండడం కొసమెరుపు.

రెండేళ్ల కిందటి క్లిప్పింగ్స్ అవి...

వంట చేస్తూ వడ్డించడం వంటి వీడియో క్లిప్పింగ్స్ రెండేళ్ల కిందటి వని కస్తూర్బా గాంధీ పాఠశాలల ఇంచార్జ్ ఉమారాణి, మండల విద్యాధికారి ఎల్లయ్యలు సోమవారం "దిశ "తో వేరు వేరుగా మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, విద్యార్థులతో కూడా మాట్లాడమని స్పష్టం చేశారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడెందుకు వైరల్ అవుతున్నాయని ప్రశ్నించగా మాకేమి తెలియదన్నారు.


Similar News