భూములకు పట్టాలిచ్చి హక్కులు కల్పించాం

దేవక్కపేట్, కారేపల్లి తదితర గ్రామల్లో అసైన్‌మెంట్‌, పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

Update: 2023-11-25 12:19 GMT

దిశ, ఆర్మూర్ : దేవక్కపేట్, కారేపల్లి తదితర గ్రామల్లో అసైన్‌మెంట్‌, పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌ మండలం దేవక్కపేట్‌, తాళ్లపల్లి, గంగరాయి, కొత్తతండాల్లో శనివారం మంత్రి వేముల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవక్కపేట్‌లో 780 ఎకరాల పోడు భూములు, 580 ఎకరాల అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పించానని గుర్తు చేశారు. ఈ భూములకు గతంలో రైతుబంధు ఇతర ప్రయోజనాలు అందక బాధపడేవారన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేశానన్నారు. ఈ గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి అందించాన న్నారు. కాలు తీసి బయట పెడితే బురద ఉండే రోడ్ల స్థానంలో కాలికి బురద అంటకుండా తండాల్లో రోడ్లు, బీటీ రోడ్లు వేయించానన్నారు. మిషన్‌ భగీరథతో తాగునీటి ఇబ్బందులు దూరం చేశానన్నారు.

    గతంలో వాగులకు, చెలిమల వద్దకు నీటి కోసం వెళ్లాల్సిన దుస్థితిలో తండాలుండేవని గుర్తు చేశారు. దేవక్కపేట్‌, మానాల తదితర గుట్టల మీద ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఇంజినీర్లు, ఆఫీసర్లు, గ్రామస్తులతో కలిసి పరిశీలన జరిపి సర్వే చేయించి ముఖ్యమంత్రికి వివరించి సాధ్యమయ్యేలా కృషి చేద్దామన్నారు. అసైన్‌మెంట్‌ పట్టాలు కాంగ్రెస్‌ హయాంలో సాధ్యం కాలేదని, గ్రామస్తుల బాధలు చూసి ప్రత్యేకమైన కృషితో సాధ్యంచేశానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రికి ఘన స్వాగతం లభించింది. దేవక్కపేట్‌లో యువకులు గులాబీరంగును ఒంటి నిండా పూసుకుని ఒంటిపై తమ గ్రామానికి చెందిన లబ్ది వివరాలను రాసుకుని డ్యాన్సులు చేస్తూ ప్రత్యేకంగా మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News