పద్మశాలీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం: ఎంపీ ధర్మపురి అర్వింద్

దేశ ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపునిచ్చారు.

Update: 2024-04-08 03:45 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశ ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పద్మశాలిసంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మార్కండేయ చిత్రపటానికి పూల మాలలర్పించారు. అనంత‌రం ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదో పద్మశాలీలు ఆలోచించుకోవాలని అన్నారు. 50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న జీవన్ రెడ్డి పద్మశాలీలను ఇంకా అభివృద్ధి చేస్తా అంటున్నారని, ఒక దఫా ఎంపీగా ఐదేళ్లు ఉన్న తాను పద్మశాలి సమాజానికి పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు 1.8 నుండి రెండు కోట్ల వరకు నిధులు మంజూరు చేశానని అన్నారు.

గత నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో నలుగురు పద్మశాలి బంధువులకు టికెట్లు ఇచ్చి ముగ్గురిని గెలిపించుకున్నామన్నారు. అదేవిధంగా రెంజల్‌లో సోదరుడు మేక సంతోష్ కు జడ్పీటీసీగా అవకాశం ఇచ్చి గెలిపించుకున్నామన్నారు. జగిత్యాల ప్రాంతంలో బలమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సోదరీమణి బోగ శ్రావణిని పార్టీలోకి ఆహ్వానించి అసెంబ్లీ టికెట్ ఇప్పించి, గట్టి పోటీ ఇచ్చేలా పోరాడి ప్రస్తుతం బలమైన రాజకీయ నాయకురాలుగా మారిందని ఆయన అన్నారు. ఇటు రాజకీయంగా, నిధుల పరంగా పద్మశాలీలకు తగు ప్రాధాన్యత ఇచ్చినామని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పద్మశాలీలకు అండగా ఉంటామన్నారు.


Similar News