తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘన చరిత్ర మాదే

బంజారాలు ఉండే తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-05 16:00 GMT

దిశ, బాన్సువాడ : బంజారాలు ఉండే తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వర్ని మండలం సిద్దాపూర్, శ్యాంరావు తాండా, కోకల్ దాస్ తాండా, చల్క తాండా, గుంటూరు క్యాంప్‌, పైడిమల్, చింతల్ పేట తాండా లలో అయన ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గత పది సంవత్సరాలలో ప్రతి గ్రామంలో, తాండాలో చేసిన అభివృద్ధి పనులను, అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభలలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే పోలింగ్ లో మీరు అందరూ మంచి మనస్సుతో ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

    బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే తాండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చి బంజారాలకు స్వయం పరిపాలన అందించిందన్నారు. ఈ ప్రాంత బంజారాల బతుకులు మార్చడానికి రూ. 200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్నదని అన్నారు. ఈ ప్రాజెక్టుతో 30 తాండాలు, 10 గ్రామాల పరిధిలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందుతుందని, పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తి చేసి భూములకు నీళ్లు అందిస్తామని, మీ పిల్లలకు, భవిష్యత్తు తరాలకు నీటి కొరత ఉండదన్నారు. ఈ ప్రాంతంలో గతంలో రెండు లక్షల రూపాయలకు ఎకరం ఉన్న భూమి విలువ ఈరోజు ఇరవై లక్షలు అయిందన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ ప్రాంతం భవిష్యత్తులో పర్యాటక కేంద్రం అవుతుందని, సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో మునిగిన భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములను ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు పోడు భూముల పట్టాలను ఇచ్చారని,

     ఇది చారిత్రక నిర్ణయమని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 2100 మంది గిరిజనులకు 4500 ఎకరాలకు పోడు పట్టాలను అందించామన్నారు. మిగిలిన పోడు భూముల రైతులకు కూడా పట్టాలు అందుతాయన్నారు. గిరిజన బాలుర కోసం నస్రుల్లాబాద్ లో గిరిజన బాలుర గురుకులం ఏర్పాటు చేయించానని, గిరిజన బాలికల గురుకులాన్ని మంజూరు చేయించి రూ. 12 కోట్లతో కోనాపూర్-హన్మాజీపేట సమీపంలో భవనాన్ని నిర్మిస్తున్నానన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు అయ్యాయని, మిగిలిన పేదలకు మూడు లక్షల రూపాయల గృహలక్ష్మీ పథకంలో ఇంటిని మంజూరు చేస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ కోకల్ దాస్ తాండా వాసులు తీర్మానం పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, నాయకులు బద్యానాయక్, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News