ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేరులోకి నీటి విడుదల..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ వరద కాలువ (ఐఎఫ్ఎఫ్సీ) పై కమ్మర్ పల్లి మండలం నాగాపూర్ గ్రామ శివారులోని 27.85 కి.మీ వద్ద ఉన్న క్రాస్ రెగ్యులేటర్ 4.8 మీటర్ల బాటమ్ గేట్లను అధికారులు మంగళవారం పైకి లేపారు.

Update: 2024-09-03 10:21 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ వరద కాలువ (ఐఎఫ్ఎఫ్సీ) పై కమ్మర్ పల్లి మండలం నాగాపూర్ గ్రామ శివారులోని 27.85 కి.మీ వద్ద ఉన్న క్రాస్ రెగ్యులేటర్ 4.8 మీటర్ల బాటమ్ గేట్లను అధికారులు మంగళవారం పైకి లేపారు. ఎస్ఆర్ఎస్పీ నీటిని సోమవారం నుండి 41 గేట్ల ద్వారా దిగువకు గోదావరిలోకి వదులుతున్న అధికారులు మంగళవారం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఐఎఫ్ఎఫ్సీ గేట్లను పైకి లేపి కెనాల్ ద్వారా నీటిని మిడ్ మానేరులోకి వదిలే ప్రక్రియను ప్రారంభించినట్లు ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.గణేష్ తెలిపారు. జూన్ 1 నుంచి ఇక్కడి క్రాస్ రెగ్యులేటర్ గేట్లను మూసి ఉంచి ఇప్పటివరకు బాల్కొండ నియోజకవర్గంలో 9 తూముల ద్వారా చెరువులకు నీరందించారు. ఆయా చెరువుల కింద 1529 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడమైందన్నారు. కెనాల్ పొడవునా రెండు వైపులా మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని పంపింగ్ చేసుకున్న రైతులు కూడా దాదాపు 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని వాడుకున్నారని డీఈఈ అన్నారు.

భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ఎగువ నుంచి వరద పోటెత్తి ప్రాజెక్టులోకి వరద నీరు ఎక్కువగా రావడంతో నీటిని మిడ్ మానేరులోకి వదులుతున్నట్లు డీఈఈ గణేష్ తెలిపారు. ప్రస్తుతం ఐఎఫ్ఎఫ్సీ ద్వారా 12 వేల క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరులోకి వదులుతున్నామని, అవసరాన్ని బట్టి ఉన్నతాధికారులు ఆదేశిస్తే కెనాల్ ద్వారా మిడ్ మానేరుకు వదిలే నీటి కెపాసిటీని ఇంకా పెంచుతామన్నారు. ఈ కెనాల్ ద్వారా పూర్తి స్థాయిలో 22 వేల క్యూసెక్కుల వరకు నీటిని మిడ్ మానేరు వరకు తీసుకెళ్లే అవకాశముందని అధికారి తెలిపారు. ప్రస్తుతం 11 వేల క్యూసెక్కులే వదులుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఆదేశిస్తే మిడ్ మానేరులోకి వదిలే నీటిని 22 వేల క్యూసెక్కుల వరకు పెంచే అవకాశాలున్నాయని ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.గణేష్ తెలిపారు. వర్షాకాలంలో ఎక్కువగా సాగునీరు అవసరం లేకపోయినా యాసంగి సీజన్ లో రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురకుండా ఐఎఫ్ఎఫ్ కెనాల్ 27.85 కి.మీ వద్ద ఈ క్రాస్ రెగ్యులేటర్ ను 2013 లో నిర్మించారన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించారు. క్రాస్ రెగ్యులేటర్ గేట్లు తెరిచే ప్రక్రియలో ఐఎఫ్ఎఫ్సీ ఇరిగేషన్ డివిజన్ 1 పోచంపాడు అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రపాణి, అసిస్టెంట్ ఇంజనీర్ రామారావుతో పాటు కిందిస్థాయి సిబ్బంది, గేట్ ఆపరేటర్లు పాల్గొన్నారు.


Similar News