దీక్షా దివస్' స్పూర్తితో రేవంత్ సర్కారుపై సమరభేరి
తెలంగాణలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కాండకావరమే,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ అరెస్టులు,లాఠీ దెబ్బలు, కూల్చివేతలు, కాల్చివేతలు, పేల్చివేతలేనా? అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబరు28: తెలంగాణలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కాండకావరమే,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ అరెస్టులు,లాఠీ దెబ్బలు, కూల్చివేతలు, కాల్చివేతలు, పేల్చివేతలేనా? అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తోంది ప్రజాపాలన కాదని, రాక్షస పాలన అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏ ముహూర్తంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాదం మోపారో కానీ..అదే తెలంగాణకు ప్రమాదకరంగా పరిణమించిందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ భూములు పాడిపంటలతో విలసిల్లితే, రేవంత్ రెడ్డి వచ్చాక అగ్నిమంటలతో కాలిపోతూ కనిపిస్తున్నాయన్నారు. సీఎం సోదరులది అంతులేని అవినీతి అని, చిట్టినాయుడి దుర్నీతికి తెలంగాణ ఆహుతవుతోందని ఆయన విరుచుకుపడ్డారు. రేవంత్ సోదరులు భూకబ్జా కోరులని ఆరోపించారు. పల్లెల్లో అధికారుల దురంహకారం పెరుగుతుండగా..సర్కారుపై రైతులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారన్నారు.
లగచర్ల నుంచి దిలావర్ పూర్ వరకూ గ్రామమేదైనా కాంగ్రెస్ సర్కారుపై ప్రజల సంగ్రామమే కనిపిస్తోందన్నారు. నిత్యం ప్రజల తిరుగుబాటుతో తెలంగాణలో ప్రతినిత్యం కనిపిస్తున్న ప్రజల తిరుగుబాటు శ్రీలంకను తలపిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. రైతులతో పెట్టుకున్నోళ్లెవరూ చరిత్రలో బాగుపడలేదని, బషీర్ బాగ్ లో రైతులను చంపించిన చంద్రబాబు నాయుడు తట్టా బుట్ట సర్దుకొని పోయిండని గుర్తు చేశారు. చిట్టినాయుడికీ చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందన్నారు.11నెలల్లో గురుకులాల్లో 48 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. నిన్న శైలజ అనే విద్యార్థిని మరణిస్తే ఆమె గ్రామానికి ఎవరూ వెళ్లకుండా నిర్బంధం అమలు చేశారన్నారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మిని కూడా నిర్బంధించారన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బంధు గణం అవినీతికి జిల్లా బలవుతోందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకులంతా ఇసుక దందాతో పాటు అనేక దందాల్లో మునిగి తేలుతున్నారన్నారు. కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. తనతో పాటు నిజామాబాద్ నగర మేయర్ భర్త పై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయనన్నారు. 11నెలల్లో 12వందలకు పైగా కేసులు నమోదయ్యాయి,మేం పాలించిన పదేళ్లలో ఇన్ని కేసులు పెడితే కాంగ్రెస్ బతికిబట్ట కట్టేది కాదన్నారు.
'దీక్షా దివస్' స్పూర్తితో రేవంత్ సర్కారుపై సమరభేరి మోగిస్తామని జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగే దీక్షా దివస్ ను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ లోని తెలంగాణ భవన్ లోనే దీక్షాదివస్ కార్యక్రమం జరుగుతుందని జీవన్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో మాజీ జడ్పి చైర్మన్ విఠల్ రావు, బోధన్ నియోజకవర్గ ఇంచార్జి ఆయేషా ఫాతిమా షకీల్, సీనియర్ నాయకులు రాంకిషన్ రావు, సుజీత్ సింగ్ ఠాకూర్, ప్రభాకర్, సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.