చిన్నారులను మింగేస్తున్న డ్రైనేజీలు

చిన్నారుల పాలిట డ్రైనేజీలు మృత్యుకూపాలుగా మారాయి.

Update: 2024-11-28 12:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 28: చిన్నారుల పాలిట డ్రైనేజీలు మృత్యుకూపాలుగా మారాయి. కొద్ది నెలల క్రితం నిజామాబాద్ నగరంలో డ్రైనేజీలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా గురువారం ఆర్మూర్ పట్టణంలోనూ ఇదే తరహాలో ప్రమాదవశాత్తు నాలుగేళ్ల చిన్నారి మట్ట ధనశ్రీ 7 ఫీట్ల లోతున్న పడి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు ఘటనల్లోనూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తోంది. అధికారుల తప్పిదమే చిన్నారుల తల్లిదండ్రులకు శాపమై ఆ రెండు కుటుంబాల్లోనూ తీరని దుఃఖాన్ని నింపింది. మున్సిపల్ పరిధిలోని డ్రైనేజీలను బల్దియా అధికారులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. బల్దియా పారిశుద్ధ్యవిభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు డ్రైనేజీలు ప్రాణాంతకంగా మారాయి. ముఖ్యంగా చిన్నారుల పాలిట అవి మృత్యుకుహరాలుగా మారడం బాధాకరంగా ఉందని చిన్నారి ధనశ్రీ మృతదేహాన్ని చూసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోట్లల్లో పన్నులు కట్టేది పసి ప్రాణాలు తీయించుకోవడానికా?

బల్దియాకు ప్రతియేటా కోట్లాది రూపాయలు పన్నులు కట్టేది మా పసి పాపల ప్రాణాలు తీయించుకోవడానికా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆస్తి పన్ను, వాటర్ పన్ను, డ్రైనేజీ పన్నులంటూ ఒక్కో ఇంటికి వేలాది రూపాయల చొప్పున ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలు వసూలు చేసే బల్దియా అధికారులు ఈ చిన్నారి మృతి పట్ల ఏం సమాధానం చెపుతారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముక్కుపిండి వసూలు చేసే పన్నులతో బల్దియా అధికారులు, కార్మికులకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తూ వారిని పోషిస్తున్నారు తప్ప ప్రజలకు కావాల్సిన పనులు చేయించడంలో విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు. వారంలో ఒకసారి కాకపోతే, కనీసం రెండు వారాలకు ఒకసారి, అదీ కుదరకపోతే నెలకోసారైనా మురికి కాలువలు శుభ్రం చేయడం కూడా చేతకాకపోతే బల్దియా అడ్మినిస్ట్రేషన్ ఏంచేస్తున్నట్లని నిలదీస్తున్నారు. నిలువెత్తు బల్దియా నిర్లక్ష్యానికి చిన్నారుల ప్రాణాలు డ్రైనేజీలో కలిసిపోతుంటే ఆ పాపం ఎవరి ఖాతాలోకి వెళుతుందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. చిన్నారిని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెపుతారంటూ ఆర్మూర్ మున్సిపల్ అధికారులను నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. కార్మికులతో అధికారులు కుమ్మక్కై వారి వేతనాల్లో కమీషన్ల కోసం వారు విధులకు హాజరు కాకపోయిన హాజరు వేస్తూ..ప్రోత్సహించడం కారణంగానే కార్మికులు పని విషయంలో బాధ్యతగా వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి. కార్మికులపై సంబంధిత అధికారుల అజమాయిషీ లోపించడమే పనుల్లో నిర్లక్ష్యానికి కారణంగా తెలుస్తోంది. కొందరు సానిటరీ ఇన్ స్పెక్టర్లు కార్మికుల నిర్లక్ష్యాన్ని ప్రోత్సహిస్తూ..వారు విధుల్లోకి రాకున్నా హాజరు వేస్తూ నెల తిరగ్గానే కార్మికుల వేతనం నుంచి కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పని చేయని కార్మికులను అధికారులు గట్టిగా అజమాయిషీ చేయలేకపోతున్నారని, ఫలితంగా ఎక్కడికక్కడ మురుగు కాలువలు నిండి ఇలా చిన్నారులను మింగే స్థాయికి చేరుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నష్టం జరగకముందే స్పందిస్తే..

జరగాల్సిన నష్టం జరిగాక బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని స్టేట్ మెంట్లు ఇచ్చే ప్రజాప్రతినిధులు ఇలాంటి ఘటనలు జరగకుండా ఏంచేయాలో ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు చేయాల్సిన పర్యవేక్షణలు అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు కూడా చేస్తే అధికారుల్లో, కింది స్థాయి సిబ్బందిలో కూడా భయం ఉంటుందని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు ఆలోచించి ఇలాంటి విషాధ ఘటనలు జరుగకుండా నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News