పైసల పంపిణీ షురూ.. కుల సంఘాల ద్వారా ఓట్ల కోనుగోళ్లు

Update: 2023-11-27 13:51 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజులు గడువు ఉండగా ఓటర్లకు తాయిలాల పంపిణీ జోరందుకుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉన్న ఒకరిద్దరు అభ్యర్థులు మినహా మిగితా వారందరూ పోల్ మేనేజ్ మెంట్‌కు తెర లేపారు. ఇప్పటి వరకు ఆత్మీయ సమ్మేళనాలు, కుల సంఘాల సమావేశాలు, అసోసియేషన్లు, యూనియన్ల మీటింగ్ లతో బిజీగా గడిపిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోబాలకు తెర లేపారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గంప గుత్తగా ఓట్లను వేసుకునేందుకు అభ్యర్థులు ఎవరికి వారు వారికి ఉన్న సామర్థ్యం మేరకు తాయిలాలను అందించే పనిలో పడ్డారు. అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోల్ మేనేజ్ మెంట్లో కుల వివక్షత బహిర్గతమైంది. కుల సంఘాల వారీగా ఒక అభ్యర్థి ఒక్కొక్క ఓటర్ ఇంటికి రూ.500 ఒక పార్టీ నేత పంపిస్తే, శనివారం మరో పార్టీ అభ్యర్థి రూ. వెయ్యి పంపిణీ చేశారు. ఆదివారం మరో అభ్యర్థి మరో అడుగు ముందుకేసి రూ.2000 వేలు పంపిణీ చేసినట్లు తెలిసింది. కేవలం అర్బన్ నియోజకవర్గంలోనే ప్రధానంగా అత్యధిక ఓటర్లు ఉన్న సామాజిక వర్గం ఓటర్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలుకు తెర లేపారని చెప్పాలి.

అత్యధిక ఓటర్లు ఉన్న బలమైన సామాజిక ఓట్లకు ఎక్కువ ధర చెల్లించడం అందుకేనన్నది బహిర్గతమైంది. బాల్కొండ నియోజకవర్గంలో మొన్నటి వరకు చీరలను పంపిణీ చేసిన అభ్యర్థి ఒక్కొక్క కుటుంబానికి రూ.2 వేల నగదుతో పాటు అర కిలో మాంసం, మద్యం క్వాటర్ లను పంపిణీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో తాయిలాల మోతాదు కనీవినీ ఎరుగనీ రీతికి చేరినట్లు సమాచారం. శనివారం అక్కడ నియోజకవర్గంలోని కొన్ని కుటుంబాలకు 4 ఓట్లు ఉంటే 16 వేలు అందజేసినట్లు సమాచారం. కొందరు అభ్యర్థులు కుల, సామాజిక వర్గాల వారీగా ఓటర్లను డివైడ్ చేసి వారికి తాయిలాలు అందించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిసింది. ఆదివారం కొన్ని నియోజకవర్గాల్లో గంప గుత్తగా ఒక్కో ఇంట్లో పురుషులు ఎందరో, స్త్రీలు ఎందరు అన్న కోటాలో తాయిలాలను ఒక్కో ఇంటికి ఓటుకు రూ.2 వేలు, నలుగురు ఉంటే ఫుల్ బాటిళ్లు మద్యాన్ని అందించే ఏర్పాట్లు చేశారు.

ఎక్కడ మద్యం పంపిణీ క్వాటర్ల వారీగా పంపిణీ స్థానికంగా బూత్ లేవల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఫుల్ బాటిళ్లయితే మద్యం షాపుల నుంచే నేరుగా సరఫరా చేసే విధంగా రిసిప్ట్ లను అందజేశారు. ఈసారి కచ్చితంగా గెలువాలని కంకణం కట్టుకుని మరీ కొంత మంది అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ కు సంబంధం లేకుండానే అమ్మలక్కలను పరిచయం ఉన్న వారి వద్దకు రప్పించి తమ అభ్యర్థి పోటీ చేస్తున్న గుర్తుకే ఓటు వేయాలని నేరుగా అప్పటికప్పుడు 300 నుంచి 500 అందజేస్తున్నారు. ఈసారి ఎన్నికలు గతంలో జరిగిన ఉప ఎన్నికలను మించిపోతున్నాయని చెబుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2010లో చివరి ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు అధికార పార్టీ అభ్యర్థికి ఖర్చు తడిసి మోపడయింది. కానీ ఆనాడే రూ.50 కోట్ల వరకు ఖర్చయినట్లు ప్రచారంలో ఉంది.

ఈసారి ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను పొగొట్టుకోవడానికి అధికార పార్టీ అభ్యర్థులు అయితే ఖర్చుకు వెనుకాడడం లేదనడంలో సందేహం లేదు. ప్రతిపక్షాల కంటే బీఆర్ఎస్ అభ్యర్థుల ఖర్చే కోట్లను దాటేలా ఉంది. ఎన్నికలకు 48 గంటల ముందే డబ్బులు పంపిణీ ప్రారంభించడంతో తమకు ఓటు వేసే ప్రతి ఓటర్ కు తాము అందించే కానుకలు అందాలన్నది వారి లక్ష్యంగా కనబడుతుంది. ఈసారి గెలువాలని కసి మీద ఉన్న కాంగ్రెస్, బీజేపీలు కూడా ఏమాత్రం తగ్గకుండా తాయిలాల పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకరిద్దరు అభ్యర్థుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల మినహా పోల్ మేనేజ్ మెంట్లో గెలిచేందుకు కోట్లను గుమ్మరిస్తున్నారు.


Similar News