హంగర్గ ఖండుగామ్ ల నుంచి ఇసుక రవాణా

నిజామాబాద్ జిల్లా బోధన్, సాలురా మండలాల్లోని ఖండుగావ్, హంగర్గ ప్రాంతాల నుంచి ఇసుక యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి.

Update: 2024-06-28 14:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్, సాలురా మండలాల్లోని ఖండుగావ్, హంగర్గ ప్రాంతాల నుంచి ఇసుక యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిపి రాత్రికి రాత్రే ఇసుకను నిజామాబాద్ జిల్లా కేంద్రానికి నిర్మల్ జిల్లాకు తరలిస్తున్నారు. స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఒక మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, ఒక ఎస్సై బంధువు కలిసి ఇసుకను తవ్వకాలు చేసి తరలిస్తున్నారు. బోధన్ సరిహద్దు ప్రాంతాలకు తరలింపులో అక్కడ పోలీసుల సహకారంతో హద్దులు దాటుతుంది.

గురువారం రాత్రి బోధన్ మండలం నుంచి వస్తున్న ఇసుక సమాచారం తెలిసి నిజామాబాద్ వైపు వస్తున్న మూడు టిప్పర్లను ఎడపల్లి పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. అదే విధంగా నిర్మల్ జిల్లా వైపు తరులుతున్న ఇసుకను రేంజల్ పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. మూడు టిప్పర్లను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాలను దాటుకుని నిత్యం ఇసుక రవాణా జరుగుతునే ఉంది. బోధన్ మండలం నుంచి ఇసుక నిజామాబాద్, నిర్మల్ వైపు తరలిపోతుంటే అక్కడ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల భీంగల్ సీఐని అక్రమ ఇసుక రవాణాలో ప్రమేయం ఉందన్న కారణంతో బదిలీ చేశారు.

కానీ బోధన్ విషయాని[కొస్తే మాత్రం అధికారులు మీనమేషాలు లెక్కేస్తున్నారు. గడిచిన నెలలో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు బోధన్ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో స్థానిక పోలీసుల పాత్ర వసూళ్ళలో సిబ్బంది పాత్ర గుర్తించిన చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటని చర్చ పోలీసు శాఖలోనే ప్రారంభమైంది. బోధన్ నుంచి తరలివస్తున్న ఇసుకను రూరల్ ప్రాంతాల్లో రెండు పోలీస్ స్టేషన్ ల అధికారులు సీజ్ చేసిన ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం వెనుక మతలబు ఏమిటని ఆరోపణలున్నాయి.


Similar News