ఆర్టీసీ డిపో కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్న 33 గ్రామాలు

రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నందిపేట్‌లో ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ డిపో ప్రతిపాదన తీరని కలగా మిగిలిపోయింది. ఆర్టీసీ డిపో పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది.

Update: 2024-10-03 03:39 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నందిపేట్‌లో ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ డిపో ప్రతిపాదన తీరని కలగా మిగిలిపోయింది. ఆర్టీసీ డిపో పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది. జిల్లాలో అతి పెద్ద గ్రామ పంచాయతీల్లో ఒకటైన నందిపేట్‌లో ఆర్టీసీ డిపో అవసరాన్ని గుర్తించి డిపో ఏర్పాటు కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టుకున్నారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం స్థల సేకరణ కావాలని కోరింది. దీంతో గ్రామ నడిబొడ్డున బస్టాండ్ పక్కనే ఐదెకరాల స్థలాన్ని సమకూర్చి రవాణా సంస్థకు అప్పగించారు. నందిపేట్ మండలంలోని 33 గ్రామాల ప్రజలు డబ్బులు జమ చేసి స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి సమకూర్చి ప్రభుత్వానికి అప్పగించారు. నందిపేట్‌లో డిపో అనుమతి రావడంతో పనులు మొదలై ఏడాదిలోపే డిపో అందుబాటులోకి వస్తుందని ప్రజాప్రతినిధులు ప్రజలకు భరోసా కల్పించడం తో ఆశగా ఎదురు చూశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏళ్లు గడుస్తున్నా, తెలంగాణ ఏర్పాటు పదేళ్లయినా ఎదురు చూపులే మిగిలాయని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నందిపేట్ వాసుల ఆర్టీసీ డిపో కలను సాకారం చేసుకునేందుకు ప్రజలు స్పందించినంత వేగంగా ప్రభుత్వం స్పందించకపోవడంతో స్థానికులు నిరసనకు దిగారు. దాదాపు 25 ఏళ్ల క్రితం అప్పట్లో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సాంబారు గిరి ఆధ్వర్యంలో బీజేపీ కి చెందిన నాయకులు ఆరుట్ల రమేశ్, రాజ్ తిలక్‌లు ఇద్దరు డిపో కోసం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరికి నందిపేట్ మండల పరిధిలోని ప్రజలే కాకుండా నందిపేట్‌తో రవాణా సంబంధిత గ్రామాల ప్రజలంతా స్వచ్ఛందంగా నందిపేట్‌కు తరలివచ్చి పెద్దఎత్తున వీరి ఆమరణ దీక్షకు మద్ధతుగా నిలిచారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అన్నీ ఒకే లక్ష్యం కోసం ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులను స్తంభింపజేశారు. ఎక్కడి కక్కడ ఆర్టీసీ బస్సులను ఆపేసి తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజులకు పైగా కొనసాగుతున్న దీక్షకు ప్రజల నుంచి విశేషరీతిలో స్పందన లభిస్తున్నప్పటికీ ప్రభుత్వం కొంచెం కూడా స్పందించలేదు. పైగా దీక్షను భంగం చేసేందుకు ప్రయత్నాలన్నీ చేశారు. మరో పక్క ఆమరణ దీక్ష చేస్తున్న ఆరుట్ల రమేశ్, రాజ్‍ తిలక్ ల ఆరోగ్య పరిస్థితి విషమించే పరిస్థితికి వచ్చింది.

బీజేపీ నేత ఆలె నరేంద్ర వస్తున్నారని..

నందిపేట్‌లో డిపో ఏర్పాటు కోసం ఉద్యమం ఈ స్థాయిలో జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రజలు మడమ తిప్పకుండా వీరి దీక్షకు మద్దతుగా నిలవడం వంటి పరిస్థితులను అప్పటి బీజేపీ ముఖ్య నాయకుడు టైగర్ ఆలె నరేంద్ర నందిపేట్ పర్యటనకు సిద్ధమయ్యారు. నరేంద్ర నందిపేట్ కు వస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని ఊహించిన ప్రభుత్వం రాత్రికి రాత్రే పోలీసులను పురమాయించి బలవంతంగా దీక్షా శిబిరాన్ని ఎత్తి వేయించారు. దీక్ష చేస్తున్న ఆరుట్ల రమేశ్, రాజ్ తిలక్‌లను బలవంతంగా హాస్పిటల్ కు తరలించి పోలీసులచే దీక్షను భగ్నం చేయించారు. డిపో విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నందిపేట్ ప్రజలను శాంతింప జేయడానికి, వారిని నమ్మించడానికి అన్నట్లు అప్పటి జిల్లా మంత్రి మండవ వెంకటేశ్వరరావు డిపో ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమానికి అప్పటికప్పుడు డేట్ ఫిక్స్ చేశారు.

రూ. 21 లక్షలతో డిపో ప్రతిపాదిత స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 21 లక్షలు మంజూరు చేయించారు. అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిపో నిర్మాణానికి దాదాపు 20 ఏళ్ల క్రితం భూమి పూజ చేశారు. తుమ్మల నాగేశ్వర్ రావు, కోడెల శివప్రసాదరావు, మండవ వేంకటేశ్వరరావు, కేసీఆర్ తో పాటు మరో మంత్రి ఐదుగురు రాష్ట్ర మంత్రులతో పెద్ద యెత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అట్టహాసంగా డిపో నిర్మాణానికి భూమి పూజ చేశారు. త్వరలోనే డిపో ఏర్పాటు చేసి, బస్సులను ఇక్కడి నుంచే నడుపుతామని మంత్రులంతా ముక్త కంఠంతో చెప్పారు. వారు చెప్పిన మాటలు ఇప్పటికీ నెరవేరలేదు.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా నందిపేట్‌కు డిపో రాలేదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నందిపేట్ డిపో నిర్మాణానికి భూమి పూజ చేసిన కేసీఆర్ తెలంగాణకు సీఎం అయ్యారు. రెండు టర్మ్‌లు వరసగా పదేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. కానీ, ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క సంతకంతో నందిపేట్‌లో డిపోను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ పదేళ్ల కాలంలో ఆ పని చేయలేదు. కేసీఆర్ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా డిపోను మంజూరు చేయలేదని నందిపేట్ వాసులంటున్నారు. డిపోను సాధించుకోవడం కోసం ఉద్యమం తప్ప తమకు ఏ మార్గం కనిపించడం లేదని ఇక్కడి ప్రజలంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినట్లే నందిపేట్ కూడా రెండుగా విడిపోయింది. కొత్తగా డొంకేశ్వర్ మండలం ఏర్పడింది. కానీ ఈ ఉద్యమంలో రెండు మండలాలు ఒకటిగా కలిసి ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే రెండు మండలాల్లోని 33 గ్రామాల గ్రామాభివృద్ధి కమిటీలు ఏకమై డిపో నిర్మాణం కోసం తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించాయి. ఇదివరకే ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడేందుకు కార్యాచరణ ప్రారంభమైంది.

డిపో కోసం ప్రతిపాదించిన ఐదెకరాల స్థలం విలువ కోట్లల్లో..

నందిపేట్ మండలంలోని ప్రజల నుంచి రేషన్ కార్డులో పేరున్న వారిని ప్రాతిపదికగా తీసుకొని డిపో నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేసేందుకు విరాళాలు సేకరించారు. ఐదెకరాల స్థలం కొనుగోలు చేసి రాష్ట్ర రవాణా సంస్థకు అప్పగించారు. డిపో ప్రతిపాదిత స్థలం విలువ ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయింది. వేలల్లో ఉన్న దాని విలువ గడిచిన 25 ఏళ్లలో కోట్లలో పెరిగిపోయింది. ఆ స్థలం విలువ దాదాపు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 40 కోట్లకు చేరిందని స్థానికులంటున్నారు. ఆ స్థలం ఎన్నో ఏళ్లుగా వృధాగా పడి ఉండటంతో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రస్తుతం నందిపేట్ సమీపంలో ఉన్న గోదావరి నదిపై వంతెన నిర్మాణం పూర్తవడం, నిర్మల్ జిల్లా నిజామాబాద్ జిల్లాల గ్రామాలకు అనుసంధానం పెరిగి దూరం దగ్గరవడంతో నందిపేట్‌లో డిపో నిర్మాణంకు అనుకూలత మరింత పెరిగిందని ప్రజలు వాదిస్తున్నారు. డిపో నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మేము సంస్థకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమిని తమకు స్వాధీన పరచాలని నందిపేట్ గ్రామస్తులు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

డిపో ఏర్పాటయ్యే దాకా ఉద్యమాన్ని వదిలేది లేదు

నందిపేట్ లో డిపో ఏర్పాటు చేస్తామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మోసం చేసింది.. ఏళ్లకు ఏళ్లు మభ్య పెట్టి పబ్బం గడుపుతున్నాయి. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరింది. ఈసారి మా ఆశలు నెరవేరతాయని, మా చిరకాల వాంఛను రేవంత్ సర్కారు అర్థం చేసుకుంటుందని నమ్మకం ఉంది. డిపో ఏర్పాటయ్యే దాకా ఉద్యమిస్తాం. అంతే కానీ మధ్యలో వదిలిపెట్టం:- సాంబారు తిరుపతి, మాజీ సర్పంచ్, నందిపేట్

డిపో కోసం ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేశాం

నందిపేట్‌లో డిపో ఏర్పాటు కోసం ఆశలు కల్పించి మోసం చేసిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశాం. ప్రాణాలకు తెగించి నాతో పాటు రాజ్ తిలక్ ఇద్దరం వారం రోజుల పాటు నిరాహార ధీక్షలు చేశాం. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాంపౌండ్ వాల్ కట్టి వదిలేశారు. తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ సీఎం అయ్యాడంటే మా కల నెరవేరుతుందనుకున్నాం. కానీ, జరగలేదు. ఇక మేమే మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. ఆరుట్ల రమేష్, నందిపేట్


Similar News