పెద్ద మల్లారెడ్డి‌లో విషాదం.. పెళ్లి కావడం లేదని యువకుడి బలవన్మరణం

తనకు పెళ్లి కావడం లేదని తీవ్ర మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-02-28 03:53 GMT

దిశ, భిక్కనూరు: తనకు పెళ్లి కావడం లేదని తీవ్ర మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కోడూరి శ్రీకాంత్ గౌడ్(32) చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబ భారం మీద పడటంతో ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. 15 ఏళ్లుగా శ్రీకాంత్ అక్కడే ఉంటూ తన ఇద్దరు చెల్లెళ్ల వివాహాలను ఘనంగా జరిపించాడు.

అదేవిధంగా సొంతూళ్లో చక్కగా ఇల్లు కూడా కట్టుకున్నాడు. పెళ్లి చేసుకొని స్వదేశంలో సెట్ అవ్వాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం శ్రీకాంత్ స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ సరైన అమ్మాయి దొరకకపోవడంతో గత కొంతకాలంగా శ్రీకాంత్ మానసికంగా కుంగిపోతున్నాడు. తన తల్లి నర్సవ్వ బీడీలు చుట్టేందుకు బయటకు వెళ్లగా.. అదే సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇంట్లోకి వెళ్లిన నర్సవ్వ కొడుకు ఉరేసుకోవడం చూసి గుండెలు అవిసేలా రోదించింది. విషయాన్ని చుట్టుపక్కల వారికి, కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందజేశారు. శ్రీకాంత్ ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు భిక్కనూర ఎస్సై రాంచందర్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Tags:    

Similar News