వ్యవసాయ మార్కెట్ లో పసుపు రైతులను దోచేస్తున్న వ్యాపారులు
సప్లయ్, డిమాండ్ సూత్రాన్ని అనుసరించి జరిగే వ్యాపారంలో వ్యాపారస్తులు కూటమి కడితే నష్టపోయేది కింది స్థాయి వారే.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సప్లయ్, డిమాండ్ సూత్రాన్ని అనుసరించి జరిగే వ్యాపారంలో వ్యాపారస్తులు కూటమి కడితే నష్టపోయేది కింది స్థాయి వారే. ముఖ్యంగా రైతులకైతే వ్యాపారుల సిండికేట్ ద్వారా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే పరిస్థితి పసుపు రైతులకు వచ్చింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం లేక మూడు సంవత్సరాలు గడిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 ఏళ్ల కాలంలో రెండేళ్లు మాత్రమే అధికార పార్టీకి చెందిన ఒకరికి చైర్మన్ పదవిని అప్పగించారు. దాదాపు ఆరేళ్లుగా ఆ పదవి ఖాళీగా ఉంది. దాంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మార్కెటింగ్ శాఖాధికారుల కంటే వ్యాపారులు చెప్పిందే వేదం. అసలే ఈ యేడాది దిగుబడి రాలేదు మొర్రో అని రైతులు నెత్తినోరు కొట్టుకుంటుంటే పసుపునకు డిమాండ్ లేదనే సాకుతో ధరను అమాంతం తగ్గించేశారు.
గత 8 ఏళ్ళ కాలంలో ఎన్నడు లేనంతగా మాడల్ పసుపు ధరనే మార్కెటింగ్ అధికారులు రూ.5300గా ప్రకటించారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. దానిని సొమ్ము చేసుకుంటూ పసుపు వ్యాపారులు పసుపు రైతులను దోచేస్తున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా గత రెండు శనివారాలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపు క్రయవిక్రయాలు జరుగడం అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు స్థానికంగా లేకపోవడంతో కింది స్థాయి అధికారులు వ్యాపారులతో లాలూచి పడి రేటును తగ్గించడమే కాకుండా శనివారం విక్రయాలు జరిగినా నోరుమెదపకపోవడం అనుమానాలను నిజం చేస్తున్నాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపు రాక ప్రారంభమైంది.
ఈ నెల 10 వరకు దాదాపు 16 వేల క్వింటాళ్ల పసుపు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 10న మాడల్ ధర ఫింగర్ (గోలా రకం) కు రూ.5055 ఉండగా, మండ రకానికి (బల్బు) రకానికి రూ.4510గా ప్రకటించారు వ్యవసాయ మార్కెట్ అధికారులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో గతంలో ఈనామ్ ద్వారా అమ్మకాలకు రిజిష్టర్ చేసుకున్న వ్యాపారులు 20 వరకు ఉండగా ఈ సారి డిమాండ్ లేదని ఏడుగురు వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. వారే వ్యవసాయ అధికారులతో కుమ్మకై ధర నిర్ణయాన్ని చేస్తుండడంతో క్వింటాల్ కు రైతు దాదాపు వెయ్యి వరకు నష్టపోతున్నారని, కొనుగోలు చేసేది కొందరే కాబట్టి రైతులు తప్పనిసరిగా వారికే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అని నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాలకు చెందిన పసుపు రైతులు ఇక్కడ పసుపు అమ్మకానికి వస్తే మంచి ధర అటుంచి మోసపోవడమే జరుగుతుందని రైతులు లబోదిబోమంటున్నారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతులను దోచుకుంటుంటే ఇప్పటి వరకు అధికార యంత్రాంగం అటువైపు వెళ్లి పట్టించుకున్న పాపానపోలేదు. మొన్నటికి మొన్న జిల్లా అదనపు కలెక్టర్ మొక్కుబడి పర్యటన మినహా రైతులకు ఒరిగింది మాత్రం శూన్యమే.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఈనామ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అది ఉత్తిమాటలే అని చెప్పాలి. ఈనామ్ లో నిజామాబాద్ వ్యాపారులే ఎక్కువగా పసుపు కొంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. వ్యవసాయ మార్కెట్ లో పసుపు ధర ఎక్కువ అయినా, తక్కువ అయినా కోట్ చేసేది వారే కావడంతో రైతులు నష్టపోతున్నారు. గత సీజన్ కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 4 లక్షల బస్తాల పసుపు కోల్డ్ స్టోరేజిలో మగ్గుతుంది. అదంతా నిజామాబాద్ పసుపు వ్యాపారులు కొనుగోలు చేసి ధర రావడం లేదని అమ్మకాలు చేయకపోవడంతో స్టాక్ కుప్పలుగా ఉంది.
వ్యాపారులు తెలివిగా ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి దానిని కోల్డ్ స్టోరేజి లో భద్రపర్చుకుని ధర ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు. మొన్నటికి మొన్న నిజామాబాద్ నుంచి వెళ్లిన ఓ రైలు వ్యాగన్ పసుపు కూడా గతంలో కొనుగోలు చేసి దాచిన పసుపుదే కావడం విశేషం. అప్పుడు కూడా పసుపు ధర రూ.6 వేలకు మించలేదు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మోడల్ ధరనే రూ.5 వేల నుంచి రూ.8 వేలు పలుకాల్సి ఉండగా ధరను అమాంతం తగ్గించి సిండికేట్ వ్యాపారులే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. వారికి హైదరాబాద్ నుంచి రాకపోకలు చేస్తున్న మార్కెటింగ్ అధికారులే వెన్నుదన్ను అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉండే ద్వితీయ శ్రేణి అధికారులు ఇక్కడ తిష్టవేసి సిండికేట్ మంత్రాంగాన్ని చెప్పుచేతుల్లో నడుపుతున్నారని చెప్పవచ్చు.