ముగ్గురు బైకు దొంగల అరెస్ట్

వరుస బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పట్టుకొని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.

Update: 2024-02-09 09:55 GMT

దిశ, కామారెడ్డి : వరుస బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పట్టుకొని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లాలో గత కొద్ది రోజులుగా తమ ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయని పలు పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదులు రాగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీల్లో స్థానిక నిజాం సాగర్ చౌరస్తాలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు దొంగలను పట్టుకుని విచారించినట్లు తెలిపారు. విచారణలో మొత్తం 29 బైకులను దొంగిలించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. కామారెడ్డి, నిజాంబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఆమె పేర్కొన్నారు. నిజాంపూర్ శశాంక్, యారు గట్ల సందీప్, షేక్ అహ్మద్ తాము దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారని,

    వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో బైకు దొంగతనాల కేసులు ఉన్నాయన్నారు. కామారెడ్డి జిల్లాలో 17 కేసులు ఉండగా కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో 12, బాన్సువాడ పోలీస్ స్టేషన్లో నాలుగు, నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని చెప్పారు. వారు దొంగలించిన 29 మోటర్ బైక్ ల విలువ సుమారు రూ.45 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కొందరు ద్విచక్ర వాహనదారులు తమ వాహనం నెంబర్​ ఒకటి కనిపించకుండా చేస్తున్నారని, దీంతో సీసీ కెమెరాల్లో దాని వివరాలు పడకుండా ఉంటుందని, అలాంటి వాహనాలను గుర్తించాలని పోలీసులకు సూచించారు. విలేకరుల సమావేశంలో కామారెడ్డి డీఎస్పీ ప్రకాష్, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. కాగా ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, సీసీఎస్ సీఐ మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, ఎస్ఐలు ఉస్మాన్, శ్రీరామ్, సిబ్బంది రాజేశ్వర్ సురేందర్, సాయిద్, కిషన్, గణపతి, శ్రవణ్, రాజేందర్, కరుణాకర్, రాజు, విశ్వనాథ, రమేష్, నరేష్, భాస్కర్, రవి, నవీన్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


Similar News