Kotarmoor: డబ్బులు ఇవ్వకుంటే వినాయక విగ్రహాలు తయారు చేయ నివ్వమని బెదిరింపులు

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ ఏరియాలో అసోసియేషన్ పేరిట గణేష్ విగ్రహాల తయారీదారుల నుంచి పలువురు భారీగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

Update: 2024-07-23 04:31 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ ఏరియాలో అసోసియేషన్ పేరిట గణేష్ విగ్రహాల తయారీదారుల నుంచి పలువురు భారీగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అసోసియేషన్‌కు డబ్బులు ఇవ్వకుంటే ఈ ఏరియాలో వినాయక విగ్రహాలను తయారు చేయనివ్వమని వాటి అమ్మకాలు జరపనివ్వమనీ అసోసియేషన్‌గా చెప్పుకుంటున్న పలువురు బెదిరింపులు చేస్తున్నట్లు గణేష్ విగ్రహ తయారీదారులు వాపోతున్నారు. ఈ ఏరియాలో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన 13 మంది వ్యక్తులు గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు షెడ్లను నిర్మాణాలు చేసుకోగా వారి వద్ద నుండి ఒక్కో షెడ్డుకు సుమారు 20 వేల నుంచి 25 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.

వీరే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశానికి చెందిన రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన గణేష్ విగ్రహాల తయారీదారుల నుంచి ఒక్కో షెడ్డుకు 50 వేల చొప్పున అసోసియేషన్ పేరిట పలువురు వసూలు చేస్తున్నారని ఆర్మూర్‌లో జనం చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ గణేష్ విగ్రహాల తయారుదారుడు సుమారు ఈ ఏరియాలో 13 షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గణేష్ విగ్రహాల తయారీదారుల నుంచి సుమారు 7 లక్షల రూపాయలను, ఆర్మూర్ ప్రాంతానికి చెందిన గణేష్ విగ్రహ తయారీదారుల నుంచి 13 షెడ్లకు గాను సుమారు 3 లక్షల రూపాయలు పలువురు వసూలు చేశారు. విగ్రహాల తయారీదారుల నుంచి ఇంత నగదు వసూలు చేయడంతో.. ఆ తయారీదారులు గణేష్ విగ్రహాల అమ్మకాలపై వాటి భారం తప్పకుండా పడుతుందని ఆర్మూర్ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.

ఉపాధి కోసం విగ్రహాలను తయారు చేసుకునే వారి వద్ద నుంచి అసోసియేషన్ పేరిట వసూళ్లకు పాల్పడడంతో ఆ నగదు తిరిగి గణేష్ మండపాలపై భారం పడుతుందని గణేష్ మండపాల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా దర్జాగా ఓ నలుగురైదుగురు కలిసి ఆ స్థలాలను లీజుకు తీసుకుంటున్నాం భారీ షెడ్లను నిర్మించుకుంటున్నాం అన్న సాకులు చూపెడుతూ ఉపాధి కోసం గణేష్ విగ్రహాలను తయారు చేసుకున్న తయారీదారులపై వసూళ్లకు పాల్పడుతున్నారని ఆర్మూర్ ప్రాంతం యువకులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఈ వసూళ్ల వల్ల రానున్న రోజుల్లో గణేష్ మండపాల నిర్వాహకులకు గణేష్ విగ్రహాలు ఆ తయారీదారులు అమ్మడం వల్ల మాపై అధిక భారం పడుతుందని గణేష్ విగ్రహం తయారీ దారుల వద్ద ఈ వసూళ్లను పలువురు చేయకుండా అధికారులు అడ్డుకోవాలని ఆర్మూర్ యువకులు కోరుతున్నారు.

ఇదంతా జరుగుతున్న ఆర్మూర్లో అధికారిక గణం చూసి చూడనట్టు వ్యవహరిస్తు న్నారని ఆర్మూర్ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి తోడు ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడి వ్యక్తిగత పిఏ గణేష్ విగ్రహాల తయారీదారుల షెడ్ల నిర్మాణదారుల నుంచి వసూళ్లకు పాల్పడి అంతా నేను చూసుకుంటా అని.. ఆర్మూర్ లోని మున్సిపల్ అధికారితో మాట్లాడతానని వారికి చెప్పినట్లు తెలిసింది. అసోసియేషన్ పేరిట గణపతి విగ్రహాల తయారీదారుల నుంచి పలువురు చేసిన వసూళ్లపై, గణపతి షెడ్ల నిర్మాణదారుల నుంచి నేను చూసుకుంటాను వసూలు చేసిన ఓ నాయకుడి పిఏ వసూళ్లపై ఆర్మూర్ యువకులు ఆగ్రహంతో మండిపడుతున్నారు.


Similar News