నేను పుట్టింది ఇక్కడే... కట్టె కాలేది ఇక్కడే

బాన్సువాడ నియోజకవర్గం తాను పుట్టిన గడ్డ అని, తాను చస్తే కాల్చేది కూడా ఇక్కడేనని బాన్సువాడ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-23 14:20 GMT

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం తాను పుట్టిన గడ్డ అని, తాను చస్తే కాల్చేది కూడా ఇక్కడేనని బాన్సువాడ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం ఉదయం ప్రారంభమైన ఆయన ప్రచారం రైతునగర్, అన్నారం, చించొలి, కిష్టాపూర్, వెంకటప్పయ్య క్యాంపు, బీర్కూర్, సాంబాపూర్, బరంగ్ ఏడ్గి, మల్లాపూర్ గ్రామాల్లో సాగి భైరాపూర్ గ్రామంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టింది బాన్సువాడ లోకల్ అని, నీవు ఎక్కడో పుట్టి ఇక్కడ చలామణి కావాలని చూస్తే ఎలాగని బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తాను సంపాదన కోసం రాజకీయాలలోకి రాలేదని,

     పనులు శాశ్వతంగా ఉండాలన్నదే తన తపన అని అన్నారు. ప్రజా జీవితం ఉన్నన్ని రోజులు ప్రజల కోసమే ఆలోచన చేస్తానని, మన నియోజకవర్గంలో అన్ని రంగాలను అభివృద్ధి చేశానని అన్నారు. రాజకీయాలు శాశ్వతం కాదని, త కుమారుడు వయసు ఉన్న నన్నే విమర్శిస్తావా అని మండిపడ్డారు. సొంత గ్రామంలో ఒక్క ఇల్లు కట్టలేని నీవు 11 వేల ఇండ్లు కట్టిన తనపై విమర్శలు చేయడమా అని ఏద్దేవా చేశారు. మూడోసారి కేసీఆర్ మళ్లీ సీఎం అవడం ఖాయమని, బాన్సువాడ ఎమ్మెల్యేగా తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 11 వేల ఇండ్లు పూర్తి చేశానని, 3 వేల ఇండ్లు గృహలక్ష్మి పథకంలో మంజూరు చేశామని, ఇంకా 7 వేల ఇండ్లు తెచ్చి బాన్సువాడలో ఇండ్లు అడిగేవారే లేకుండా చేస్తానన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి చేతిలో మోస పోయిన ఆయన సొంత గ్రామం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన దళితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, సొసైటీ చైర్మన్ కొల్లి గాంధీ, ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ సందీప్, మండల యూత్ అధ్యక్షులు శశికాంత్, దుంపల రాజు పాల్గొన్నారు. 


Similar News