మందుల కొరత లేకుండా చూడాలి
కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు.
దిశ, కామారెడ్డి : కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు, డెంగ్యూ జ్వరం కేసుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను ప్రత్యేక్షంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను తిరిగి ఇన్ పేషంట్ గా అడ్మిట్ అయిన రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. జ్వరం కేసుల తీవ్రత దృష్ట్యా జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని, వైద్యులు సకాలంలో స్పందించాలని సూచించారు.
ఆసుపత్రిలో మందుల కొరతను వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి తగు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. వైద్యుల కొరత లేకుండా నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ఏయే మండలాల నుండి ఎక్కువ జ్వరం కేసులు వస్తున్నాయని ఆరా తీసి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ ని ఆదేశించారు. ఆసుపత్రిలో ఇన్ పేషంట్ గా అడ్మిట్ అయి చికిత్స పొందుతున్న డెంగ్యూ పాజిటివ్ కేసు రోగులను ప్రత్యక్షంగా కలిసి వారికి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఈ సీజన్లో వ్యాధులు అధికంగా ప్రభావం చూపుతాయని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఆసుపత్రిలో శానిటేషన్ చేస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.