ఏటేటా ఒక్కోచోట గణనాథుని నిమజ్జనం.. అదే వారి స్పెషాలిటీ..
గతేడాది తిరుపతి సమీపంలో... అంతకుముందు విజయవాడలో, ఈసారి అత్యంత ప్రాశస్త్యం పొందిన కాశీ నదిలో గణేశున్ని నిమజ్జనం చేయాలని ఫిక్స్ అయ్యారు క్లబ్ సభ్యులు.
దిశ, భిక్కనూరు : గతేడాది తిరుపతి సమీపంలో... అంతకుముందు విజయవాడలో, ఈసారి అత్యంత ప్రాశస్త్యం పొందిన కాశీ నదిలో గణేశున్ని నిమజ్జనం చేయాలని ఫిక్స్ అయ్యారు క్లబ్ సభ్యులు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలతో పాటు, ఆ దారిలో ఉండే దేవాలయాలన్నిటిని దర్శించుకోవచ్చన్న ఉద్దేశంతో గత 9 సంవత్సరాలుగా ఆలయాల సమీప ప్రాంతాలలో ఏదో ఒకచోట గణేశున్ని నిమజ్జనం చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శ్రీ నేతాజీ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు ఈ ఏడాది నవరాత్రుల పాటు పూజలందుకున్న గణేష్ నిమజ్జనాన్ని కాశీలో చేయాలని డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు ఒక వాహనాన్ని మాట్లాడుకొని, ఆ వాహనానికి అడ్వాన్స్ ఇవ్వడమే కాకుండా, ప్రోగ్రాం షెడ్యూల్ ను కూడా తయారు చేసుకున్నారు. ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలోని తిరుపతి, శ్రీశైలం, విజయవాడలతో పాటు, పాతాళ గంగ, తెలంగాణలోని భద్రాచలం, బాసరలో వారు ప్రతిష్టించిన గణేశుడిని నిమజ్జనం చేయగా, ఈసారి స్పెషల్ ఉండాలన్న ఉద్దేశంతో కాశీలో నిమజ్జనం చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. గత 28 సంవత్సరాలుగా గణేశున్ని ప్రతిష్టిస్తున్న 12 మంది క్లబ్ సభ్యులు, వచ్చే సంవత్సరం గోల్డెన్ టెంపుల్ సమీపంలోని నదిలో నిమజ్జనం చేసి, వారసులకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.