పట్టి పీడిస్తున్న వడ్డీ జలగలు..బలవన్మరణానికి పాల్పడుతున్న బాధితులు

జిల్లాలో వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది

Update: 2024-11-08 02:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పట్టణ స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు వడ్డీ దందా కొనసాగుతోంది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి సామాన్య, మధ్యతరగతి, చిరుద్యోగులు ఊళ్లు వదులుతున్నారు. ఈలెక్కన జిల్లాలో వడ్డీ వ్యాపారం ఏ రేంజ్‌లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ప్రైవేటు, వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి పేద లతోపాటు సామాన్యులు, చిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. వడ్డీలు కట్టలేక విలవిల్లాడుతున్నారు. వ్యాపారుల వద్ద చేసిన అప్పులు సకాలంలో చెల్లించకున్నా, ప్రతినెలా చెల్లించాల్సిన వడ్డీ సమాయానికి చెల్లించకపోయినా అప్పు తీసుకున్న వారికే కాదు.. వారి కుటుంబ సభ్యులకు కూడా చుక్కలు చూపిస్తున్నారు.

అప్పులు తీర్చకుండా ఇంట్లోని ఆడవాళ్ల బట్టలు విప్పదీసి నడిరోడ్డు మీద నిలబెడదామని పరుషంగా హెచ్చరిస్తున్నారు. కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలంటే ఎత్తుకెళ్లి పోతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అప్పులు తీసుకున్నాక వారికి సకాలంలో అప్పు తీర్చే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక నానా తంటాలు పడుతున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులకు తట్టుకోలేక, అప్పులు తీర్చే మార్గం లేక అవస్థలు పడుతున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల నుండి బయట పడే మార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారుల మఠాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రిజిష్టర్డ్ ఫైనాన్స్ లపేరుతో కొందరు జీరో వ్యాపారం చేస్తుండగా, మరి కొందరు దర్జాగా అక్రమ పద్ధతిలో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉమ్మడి జిల్లాలో ఫైనాన్స్ రంగాన్ని, వడ్డీ వ్యాపారాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్నారు. వ్యాపార సంస్థలతోపాటు, అడ్డగోలు వడ్డీలతో హింసించే ఓ ప్రత్యేక కమ్యూనిటీకి చెందిన వర్గం జిల్లాలో వడ్డీ వ్యాపారాన్ని శాసించేది. వారి వద్ద అప్పు తీసుకుంటే నరకానికి దారి వేసుకున్నట్లేననే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో, ఇతరత్రా మార్గాల్లో కోట్లాది రూపాయలు కూడబెట్టిన కొందరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు.

మరి కొందరు వైట్ కాలర్ ప్రొఫెషన్ గా పన్నులు కడుతూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారు వారి బ్లాక్ మనీని కొందరు వ్యక్తలు ద్వారా వడ్డీ వ్యాపారంలో పెడుతున్నారు. వారి ద్వారా అవసరం ఉన్న వ్యాపారులు, సాధారణ వ్యక్తులకు అధిక వడ్డీలకు రుణాలిస్తున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను వ్యాపారంలో పెట్టి సక్సెస్ అయితే అప్పు చేసిన డబ్బులతో బాగా సంపాదించి చేసిన అప్పులు తీర్చే స్తున్నారు. కానీ, విధి ఎదురు తిరిగి వ్యాపారాల్లో నష్టపోతే అప్పులు తీర్చే మార్గం లేక, వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక, సమాజంలో తమకున్న పరువు బజారుపాలవుతుందనే ఆవేదనతో అర్ధంతరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నూటికి రూ. 5 నుంచి రూ. 15 ల వడ్డీ

పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వడ్డీ వ్యాపారులు రెచ్చి పోతున్నారు. ఫైనాన్స్ వ్యాపారులు నూటికి రూ. 5 నుంచి రూ. 15 ల వరకు వడ్డీతో అప్పులు ఇస్తున్నారు. మరి కొందరు బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని రూ. 20 ల వరకు వడ్డీ ఒప్పందంతో అప్పులిస్తున్నారు. అవసరానికి మరో మాట మాట్లాడకుండా అప్పులు తీసుకుంటున్నారు. ఇబ్బందుల్లో పడుతున్నారు. సాధారణంగా గ్రామాల్లో నూటికి రూ. 2 ల చొప్పున వడ్డీకి అప్పులిచ్చే వారు. కానీ, ఎప్పుడైతే రిజిష్టర్ ఫైనాన్స్ లు వడ్డీ వ్యాపారం లోకి వచ్చాయో అప్పటి నుంచి వడ్డీ వ్యాపారులకు ఇది ఓ వరంగా మారింది. ఈ మధ్యకాలంలో మనుషుల ఆలోచనల్లో వచ్చిన మార్పు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సైతం వడ్డీకి డబ్బులు బాకీ ఇచ్చేందుకు చాలామంది వెనకాడుతున్నారు. అవసరానికి అప్పులు చేసి సమయానికి అప్పు తీర్చే మార్గం లేక ఎగ్గొట్టే వారూ లేకపోలేదు.

లక్షల్లో అప్పులు చేసి ఐపీ పెట్టేవారు కూడా కోకొల్లలుగా ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. ఐపీ లకు భయపడి చాలా మంది అప్పులు ఇవ్వడానికి వెనకంజ వేస్తుంటే మరి కొందరు ఇచ్చిన అప్పులు ఎలాగైనా వసూలు చేసే టాలెంట్ ఉన్న వారు అప్పులిచ్చి తిరిగి వసూలు చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. వీరు సమాజంలోని ఏ వ్యవస్థకు భయపడకుండా తాము అనుకున్నది చేస్తున్నారు. జీరో ఫైనాన్స్ వ్యాపారులు, అత్యధిక వడ్డీరేట్లతో అప్పులు ఇచ్చే ప్రత్యేక వర్గానికి చెందిన వ్యాపారులు మార్కెట్లో ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని వడ్డీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. అధిక వడ్డీలతో అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారు.

ఏ దారి దొరక్క..

డబ్బు అవసరం మనిషిలోని ఆలోచన శక్తిని తన ఆర్థిక స్థోమతను మరిపించేస్తోంది. అప్పటి కప్పుడు తన ముందున్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడానికి అప్పు ఒక్కటే శరణ్యమని అనుకున్నప్పుడు తను తిరిగి చెల్లించాల్సిన వడ్డీ రేటు గురించి ఆలోచించడం లేదు. వడ్డీ ఎంతైనా పర్వాలేదు. అప్పు దొరికితే చాలు అని భావిస్తున్నారు. అదే వారిని సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఆత్మహత్యలకు దారి తీస్తోంది.

వడ్డీ వ్యాపారుల బాధితుల్లో టాలీవుడ్ నిర్మాత సైతం..

వడ్డీ వ్యాపారుల బాధితుల్లో హైదరాబాద్ కు చెందిన టాలీవుడ్ కు చెందిన ఒక నిర్మాత కూడా ఉన్నారు. వ్యాపారుల వేధింపులు భరించలేక ఆ నిర్మాత ఓ న్యూస్ ఛానల్ సీఈఓ తో కలిసి నిజామాబాద్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు ఈ విషయంలో బాధిత నిర్మాతకు న్యాయం చేయకపోగా, మధ్యే మార్గం తో వారితోనే ఒప్పందం చేసుకుని గడువు తీసుకుని అప్పు చెల్లించాల్సిందిగా సూచించారు. వడ్డీ వ్యాపారులను పోలీసులు సైతం ఏమీ చేయలేరనే వాస్తవం తెలిసి సదరు నిర్మాత ఆస్తులమ్మి అప్పులు తీర్చాడు.

వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగానే జక్రాన్ పల్లి మండలం అర్గుల్ కుంట రాజేష్ అలియాస్ ఇటుక బట్టి రాజేష్ (42) అనే యువరైతు అప్పులోళ్ళ వేధింపులు తట్టుకోలేక చెట్టుకురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో వ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టింది.

కామారెడ్డిలో కూడా ఓ కుటుంబం వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైంది. తాజాగా ఓ కుటుంబం బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదృష్టవశాత్తు ఆ కుటుంబంలోని ఓ మహిళను స్థానికులు రక్షించినా, మిగతా సభ్యులు నీళ్లలో గల్లంతై మృతి చెందారు. చేసిన అప్పు తీర్చకపోతే ఆడవాళ్ల ఒంటి మీద బట్టలిప్పేస్తామని వడ్డీ వ్యాపారులు హెచ్చరించి, భయపెట్డడంతో ఆత్మాభిమానం దెబ్బ తిన్న ఆ కుటుంబం బతకడం చావడమే మేలనుకుంది. అందుకే ఆత్మహత్యే శరణ్యమని భావించి గోదావరి లో దూకేసింది. నిజామాబాద్ కు చెందిన ఓ పెట్రోల్ బంక్ వ్యాపారి కూడా కుటుంబంతో సహా విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలున్నాయి. వీరంతా వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన వారే.

వీరి దగ్గర అప్పు తీసుకుంటే అంతే సంగతి..

ఆర్మూర్ పట్టణంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కోట్లలో అప్పులిస్తారు. వారు వడ్డీని, అసలును వసూలు చేసే తీరు దారుణంగా ఉంటుందని చెపుతారు. అప్పు విషయం, వడ్డీ విషయంలో ఆ వ్యాపారులు ఇంటి వద్దకు రానంతవరకే బాగుంటుందని, ఒక వేళ వచ్చారంటే ఎందుకు బతికున్నాంరా దేవుడా బాధపడేలా ఆ వ్యాపారుల వేధింపులు చిత్ర విచిత్రంగా ఉంటాయని మార్కెట్లో చెప్పుకుంటారు. వారి వద్ద తీసుకున్న అప్పు కూడా అంత తేలిగ్గా తీర్చే అవకాశం ఉండదని, చాలా మంది వారి దగ్గర అప్పు చేయడానికి జంకుతారు. ఎక్కడ ఏ అవకాశం లేని వారు మాత్రమే వారి దగ్గర అప్పులు చేసి తిప్పలు పడేవారెందరో ఉన్నారు.


Similar News