కేజీబీవీ,మోడల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం,మోడల్ స్కూల్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 23: జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం,మోడల్ స్కూల్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్న బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఉడకబెట్టేందుకు సిద్ధంగా ఉంచిన కోడి గుడ్లను నీటితో నిండి ఉన్న గిన్నెలో వేసి వాటి నాణ్యతను పరిశీలించారు. కోడిగుడ్లు బాగున్నాయో, చెడిపోయాయో అని తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆహార పదార్థాలు, భోజనం వండేందుకు వినియోగించే పదార్థాలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు. స్టోర్ రూమ్ లో గోధుమ పిండి, ఇతర ప్యాకెట్లు తెరిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వాటిని కలుషితం కాకుండా జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. కల్తీ, నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. విద్యార్థినులను పలుకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తహశీల్దార్, టీవీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహశీల్దార్ కిరణ్మయి తదితరులు ఉన్నారు.