సన్మాన కార్యక్రమానికి పాఠశాల వేదిక.. ఎండలో ఇబ్బందులు పడ్డ స్కూల్ విద్యార్థులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: 40 డిగ్రీల ఎండలు వచ్చాయని ప్రభుత్వం పాఠశాలలకు ఒకపూట బడులను నిర్వహిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ముగించి విద్యార్థులను ఇంటిని పంపే కార్యక్రమం కొనసాగుతుంది. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుండగా.. 1 నుంచి 9వ తరగతి వారికి మధ్యాహ్నం పూట సెలవులు ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు ఎండ కష్టాలు తెలిసివచ్చాయి. అందుకు కారణం చందూర్ గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నిక కాగా.. అందుకు పంచాయతీ పాలకవర్గానికి సన్మాన కార్యక్రమానికి ప్రైవేట్ ఫంక్షన్ హల్, రైతు వేదికలు, పంచాయతీ భవనంలో నిర్వహించుకోవాల్సిన పాలకవర్గం.. పాఠశాలను వేదిక చేసుకోవడంతో విద్యార్థులకు ఎండ కష్టాలు చవిచూశారు.
విద్యార్థులను ఆరుబయట పాఠశాల ఆవరణలో కూర్చుండ బెట్టి సన్మాన కార్యక్రమంలో శ్రోతలను చేయడంతో వారికి ఎండ కష్టాలు తప్పలేదు. సన్మాన కార్యక్రమాలకు గ్రామస్తులను పిలిచి చేసుకోవాల్సిన అధికార పార్టీ గ్రామ ప్రజాప్రతినిధులు ప్రజలు వచ్చే పరిస్థితి లేరని పాఠశాలలో నిర్వహించుకోవడంతో ఈ కష్టాలు తప్పలేవు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు 'దిశ' వివరణ కోరగా విద్యార్థులను ఆరుబయట చెట్టునీడనే ఉంచామని వివరణ ఇచ్చారు. పాఠశాలకు పంచాయతీ పాలకవర్గం సహకరిస్తున్నారని వారికి సమావేశం నిర్వహించుకోవడానికి ఇచ్చామని తెలుపడం విశేషం.