నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదా..? ఈఎన్‌సీకి చేరిన నీటి పారుదల శాఖాధికారుల నివేదిక

నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కాలువకు పడిన గండి

Update: 2024-04-08 15:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కాలువకు పడిన గండి నీటి పారుదల శాఖాధికారుల మెడకు చుట్టుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టం ఫుడ్ చుకోలేనిదని అధికారులు నిర్ధారించారు. కాలువల కబ్జాలు షెడ్డుల నిర్మాణంతో అక్కడ కాలువకు గండి పడిందని స్థానిక డివిజన్ (సర్కిల్) అధికారులు నివేధిక ఇచ్చారు. అక్కడ కబ్జాకు కారకుడైన వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఈ విషయంలో జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ స్వయంగా క్షేత్రస్థాయిలో సంధర్శించి సంబంధిత నివేధికను నీటి పారుదల శాఖ ఇంజనీర్ చీఫ్ కు పంపినట్లు తెలిసింది. అక్కడ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిసింది. దాదాపు ఎస్ ఈ, ఈఈ, డి ఈ, ఎఈ స్థాయి అధికారుల వరకు వేటు పడే అవకాశం ఉందని సమాచారం.

ఈ నెల 1న ఆర్మూర్ పట్టణంలో నిజాం సాగర్ కాలువ 82/2 కాలువకు గండి పడింది. జర్నలిస్ట్ కాలనీ తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రధాన కాలువకు 5 మీటర్ల నుండి 10 మీటర్ల విస్తీర్ణంలో కాలువకు గండి పడి నీరు వృధాగా పోతుంది.అంతే కాకుండా కాలనీలలో ఇండ్లలోకి చేరి వానాకాలం వరధలను తలపించింది. 135 క్యూసెక్కుల ప్రవాహం సామార్థ్యం కలిగిన కాలువలో 100 క్యూసెక్కుల స్పీడుతో నీరు కాలువకు పడిన గండి ద్వార కాలనీకి చేరింది. నీటి పారుధల శాఖాధికారులకు ఈ విషయం ఉదయం 7 గంటల వరకు తెలియకపోవడంతో నీరు మొత్తం కాలనీలలో మోకాలు లోతు వరకు చేరిపోయింది. అధికారులు ఈ విషయంలో స్పంధించడంలో ఆలస్యం చేయడం , పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల నిలుపుదల చేయకపోవడం వలన ఒకవేళ 3 వేల నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నీరు ప్రవహించి ఉంటే అస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం ఉండేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిజాం జమానాలో నిజాంసారగ్ ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టుకు నీరందించేందుకు అనాడు కాలువల నిర్మాణం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మండలం లో చివరి కాలువ ఉంది.

ఈ నెల 1న నిజాంసాగర్ కాలువకు గండి పడిన ఘటనలో అధికారులు నిర్లక్ష్యంపై ప్రధానంగా నిరంతరాయంగా పంపులు పని చేయడం వల్ల నీరు వృథా అయిందనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో పెద్దలతో అంటకాగిన అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్ కాలువపై కబ్జాలు ఏర్పడిన వాటిని తొలగించలేదు. అంతేగాకుండా ఆర్మూర్ బల్ధియాకు సంబంధించిన మురుగునీరు నీటి పారుదల శాఖ కాలువలో కలుస్తున్నా స్పందించలేదు. అంతేగాకుండా కాలువల నిర్వాహణ వ్యవహరాన్ని నిర్లక్ష్యం చేయడంతోనే గండిపడినట్లు నివేదిక సమర్పించారు. ఇప్పటికే ప్రభుత్వం నీటి వినియోగం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరికలు జారీ చేసింది. వేసవి కాలం కావడంతో చుక్క చుక్క నీటిని ఒడిసి పట్టి చివరి ఆయకట్టుకు సాగునీరందించాలని ప్రభుత్వం సంకల్పిస్తే అధికారుల నిర్లక్ష్యంతో వందల క్యూసెక్కుల నీరు ఎలాంటి ప్రయోజనం దక్కకుండానే నేల పాలైంది. ఈ విషయంలో నిజామాబాద్ సర్కిల్ లోని అధికారులపై ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ప్రభుత్వం వారిపై వేటు లేదా బదిలీ చేస్తున్నట్లు నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతుంది.


Similar News