మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఎర్రజొన్నకు ధర చెల్లించాలి

ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.

Update: 2024-02-09 10:04 GMT

దిశ ప్రతినిధి,నిజామాబాద్ : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి తో కలిసి కలెక్టర్ వ్యవసాయ అధికారులు, విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్ ఒప్పందానికి కట్టుబడి కొనుగోళ్లు జరగాలని, ఒకవేళ రైతులు బయట మార్కెట్లో ఎక్కువ ధరకు ఇతర ట్రేడర్లకు పంట అమ్ముకోవాలని భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్ లో ఎర్రజొన్న సాగు చేసిన విస్తీర్ణం, పంట దిగుబడులు, రైతులతో ఆయా కంపెనీల వ్యాపారులు కుదుర్చుకున్న ఒప్పందం, స్వేచ్ఛ విఫణిలో ఎర్రజొన్న పంటకు లభిస్తున్న ధర, మార్కెట్ డిమాండ్ తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి సేకరించిన ఎర్రజొన్న పంటను ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్,

     రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని, అక్కడ ఎర్రజొన్నను పశువులకు దాణాగా వినియోగిస్తారని సీడ్ కంపెనీల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈసారి పంటకు మార్కెట్లో ఆశించిన రీతిలోనే ధర పలుకుతోందని తెలిపారు. పంట వెరైటీలను బట్టి క్వింటాకు రూ. 3500 నుండి 4300 వరకు ధర లభిస్తుండగా, తాము కూడా రైతులతో అదేరీతిలో బైబ్యాక్ ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభం అయ్యాయని, మరో పక్షం రోజుల తరువాత పెద్ద ఎత్తున దిగుబడులు చేతికందుతాయని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా గతేడాది తరహాలోనే ఈసారి కూడా రైతుల నుండి మద్దతు ధరకే ఎర్ర జొన్న పంటను సేకరిస్తామని, సీజన్ చివరి దశ వరకు కూడా క్వింటాకు కనీస మద్దతు ధరగా రూ. 3500 వరకు చెల్లిస్తామని ట్రేడర్లు స్పష్టమైన హామీ ఇచ్చారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఏఓలు, ఏఈఓలను అప్రమత్తం చేసి ఎర్రజొన్న క్రయవిక్రయాలను నిశితంగా పరిశీలన జరిపించాలని, ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఎక్కడా కూడా వ్యాపారులు కూడబలుక్కుని ధర తగ్గించారనే ఫిర్యాదులు రాకూడదని, మార్కెట్ డిమాండ్ ను అనుసరిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో ట్రేడర్లు ధర చెల్లింస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలని అధికారులకు హితవు పలికారు. ఎవరైనా వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులను మోసగించే చర్యలకు పాల్పడితే జిల్లా యంత్రాంగం ఉపేక్షించబోదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఏడీఏలు, ఏఓలు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News