దిశ, భిక్కనూరుః విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు వరి సాగుపై తెగిపడ్డాయి. ఈ విషయాన్ని రైతులు ట్రాన్స్ కో సిబ్బంది దృష్టికి వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రంలోని కొత్త దళితవాడకు చెందిన పొట్టి గిని రాజయ్య, నర్సింలు తన వ్యవసాయ భూమిలో వరి సాగు చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా వైర్లు తెగిపడి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అప్పటినుంచి ట్రాన్స్ కో అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. తీగలు తెగి పడడం వల్ల 25 వ్యవసాయబావులకు త్రీఫేస్ కరెంటు సరఫరా నిలిచిపోయింది. తాజాగా సోమవారం సబ్ స్టేషన్ కు బాధిత రైతులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అధికారులు లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. చేసేదేమీ లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వరి పంటలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి.