అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయం

అవినీతిరహిత, పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకు అధికారులు పూర్తిగా సహకరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీసి, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కోరారు.

Update: 2024-02-01 13:04 GMT

దిశ, కామారెడ్డి : అవినీతిరహిత, పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకు అధికారులు పూర్తిగా సహకరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీసి, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కోరారు. ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం తొలిసారిగా కామారెడ్డి పట్టణానికి వచ్చిన షబ్బీర్ అలీ ని జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారుల సంక్షేమ సంఘం ముద్రించిన నూతన క్యాలెండర్ ను షబ్బీర్ అలీ ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొంతమంది అధికారుల అవినీతి కారణంగా ఆ శాఖకే గాక వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వ అధికారులపై ఎంతో నమ్మకముందని, ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పేద ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పారదర్శకంగా పనిచేయాలని కోరారు. తాను మంత్రిగా పనిచేసిన కాలంలో గ్యాస్, పవర్ ప్లాంట్, బొగ్గు, విద్యుత్ కు తదితర వాటికి సంబంధించి దేశంలో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలతో వ్యవహారాలు నిర్వహించానని, ఇంతవరకు తనపై ఎటువంటి మచ్చలేదన్నారు. ఇది ముఖ్యమంత్రి నియోజక వర్గం గా భావించి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుటలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.

    ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రెండిటిని ఇప్పటికే అమలు చేస్తున్నామని, మిగతా గ్యారంటీలను కూడా పక్షం రోజుల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేరే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజారామ్ మాట్లాడుతూ...అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించుటలో శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ సీఈఓ సాయ గౌడ్, జిల్లా అధికారులు దయానంద్, సతీష్ యాదవ్, మురళి, శ్రీనివాస్, లాలు నాయక్, వరదా రెడ్డి, సింహారావు, సురేందర్ కుమార్, భాగ్యలక్ష్మి, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News