ఇందూరులో కోడి పందేలకు రంగం సిద్ధం.. రూ.లక్షలు బెట్టింగ్‌కు పందెరాయుళ్లు రెడీ

సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో కోళ్ల పందేలు నిర్వహించేందుకు జూదగాళ్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

Update: 2024-01-15 02:48 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో కోళ్ల పందేలు నిర్వహించేందుకు జూదగాళ్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మంజీర, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ఆంధ్ర క్యాంపుల్లో పోటీలు కొనసాగతాయని సమాచారం. కాగా, సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించకునేందకు జిల్లాలో వాసులు అంతా సిద్ధం చేసుకున్నారు. కోళ్ల పందేల నిర్వహణకు శివారు ఆటవీ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలలో (ఫాం హౌజ్)లలో పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బరిలో దిగే కోళ్లకు ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి, పోటీలో దింపేందుకు సిద్ధమయ్యారు.

దీనికి ఈ నెల13 నుంచే నిర్వాహకులు అన్ని ఎర్పాట్లు చేస్తున్నారు. గడిచిన వారాంతపు సంతలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పందేం కోళ్ల విక్రయాలు జోరుగా కొనసాగాయి. పందెం కేంద్రాల వద్ధ వచ్చే వారికి సకల సౌకర్యాలను ఎర్పాటు చేసి అహ్వానాలను అందించినట్లు సమాచారం. పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో కేవలం కోళ్ల పందేల్లో పార్టిసిపేట్ చేసే వారికి మాత్రమే సోషల్ మీడియా వేదికగా అహ్వానాలు పంపుతున్నారు. ఉమ్మడి రాష్ర్టంలోనే నిజామాబాద్ జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలనుంచి వేలాది మంది దశాబ్ధాల క్రితమే వలస వచ్చి, స్థిర నివాసాలను ఎర్పాటు చేసుకున్నారు.

ఆ ప్రాంతాలను క్యాంపులుగా పిలుస్తారు. ఈ క్యాంపుల్లో పందెం కోసం కోళ్లకు ప్రత్యేక తర్పీదు ఇస్తారని తెలుస్తోంది. గతంలో పందేలు నిర్వహించే వేదికలపై పోలీసులు దాడులు చేసి, కేసులు కూడా నమోదు చేశారు. నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పరిధిలోని గ్రామాలను మొదలుకుని బోధన్, బాన్సువాడ, సాలురా, వర్ని, నందిపేట్, కోటగిరి, మాక్లూర్, ఆర్మూర్ మండల్లాలో చాలా గ్రామాలు ఆంధ్ర క్యాంపు గ్రామాలు ఉన్నాయి.

జిల్లాలోని పెంటకుర్దు, హుమ్నాపూర్, సత్యనారాయణపురం, పాంగ్రా, వర్ని, ఆంధ్రా నగర్, కోటగిరి, ధర్మారం, మాదవ నగర్, ఆర్మూర్, జడీ జమాల్‌పూర్, సిద్ధాపూర్, ఎత్తోండ, మల్లారం , బోప్పాపూర్ వాగు ప్రాంతాలలో పందేల ఎర్పాట్లు జరిగాయి. ఆర్మూర్ పట్టణ శివారులోని ఒడ్డేర కాలనీ నిర్వాహకుల అధ్వర్యంలో జరిగే కోళ్ల పందేలకు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, బాల్కొండ ప్రాంతాలలో స్థిర పడ్డ వలస ప్రజలు వస్తుంటారు. ఇక్కడ రెండు రోజుల్లోనే రూ.లక్షలు చేతులు మారుతాయి. కోళ్లపందేల నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సిబ్బందితో ములాఖాత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. అంతే కాకుండా కోళ్ల పందేలు జరిగే ప్రాంతలో దాదాపు 2 కి.మీ రాకపోకలను కనిపెడుతూ వాటిని పకడ్బందీగా నిర్వహణకు ఎర్పాట్లు చేసినట్లు సమాచారం.

ఆంధ్రా నుంచి ఇందూరుకు..

ఈ సంస్కృతి ఆంధ్ర ప్రజల ద్వారా ప్రవేశించినప్పటికీ, పండగల సమయంలో జూదరులకు అటవిడుపుగా తయారయ్యాయి. డబ్బుతో అడే పేకాట కన్నా, కోళ్ల మధ్య జరిగే పోటీపై ఆసక్తి జూదరులకు ఎక్కువగా ఉంటుంది. పోలిటికల్ లీడర్లు, వ్యాపారులు ఇతర రంగాల్లో స్థిరపడటంతో వారు కోళ్ల పందేలు జరిగే ప్రాంతాల్లో వాలిపోతుంటారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా కల్మేశ్వర్ సింగానారే బాధ్యతలు తీసుకున్న తరువాత జూదం, మట్కా, బెట్టింగ్ లపై ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే ఒక్కసారి కోళ్ల పందేలను అడ్డుకున్నారు. రెండు రోజులుగా పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినా.. పందెం కోళ్లు మాత్రం కత్తులు కట్టుకుని కాళ్లు దువ్వుతున్నట్లు తెలుస్తోంది. పోటీలను విజవంతంగా నిర్వహించి జూదరులు సక్సెస్ అవుతారా..? పోలీసులు అడ్డుకుని పందేలను కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News