కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ

నిజామాబాద్ జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ గురువారం ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చారు.

Update: 2023-12-01 11:38 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ గురువారం ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చారు. ఆయా సెగ్మెంట్ల నుండి ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు ఈవీఎంలు తరలించగా , జాగ్రత్తగా వాటిని సరిచూసుకుని స్ట్రాంగ్ రూంలలోకి ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా క్రమపద్ధతిలో అమర్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశారు. జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డిలు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

     ఎలాంటి గందరగోళం, లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూంలతో పాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను అమర్చి, మానిటర్ల ద్వారా పర్యవేక్షణ జరిపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులోకి తెస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఇతరులెవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు.

    కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్లు పై అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో ఏర్పాటు చేసిన బారీకేడ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ జయరాం, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 


Similar News