విద్యారంగానికి బడ్జెట్ పెంచాలి.. లక్ష్మారెడ్డి
విద్యా రంగానికి బడ్జెట్ లో నిధులు పెంచాలని, గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ప్రతి యేటా ఒక్కో శాతం బడ్జెట్ ను తగ్గిస్తూ తొమ్మిది సంవత్సరాల్లో 14 శాతం నుండి 6 శాతానికి తీసుకొచ్చిందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు లక్ష్మారెడ్డి ఆరోపించారు.
దిశ, కామారెడ్డి : విద్యా రంగానికి బడ్జెట్ లో నిధులు పెంచాలని, గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ప్రతి యేటా ఒక్కో శాతం బడ్జెట్ ను తగ్గిస్తూ తొమ్మిది సంవత్సరాల్లో 14 శాతం నుండి 6 శాతానికి తీసుకొచ్చిందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు లక్ష్మారెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) కామారెడ్డి జిల్లా 5వ మహాసభ స్థానిక భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణం, బాలుర ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మెనిఫెస్టో ప్రకారం విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్ లో కేవలం 7 శాతం మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే తక్షణమే నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమీషన్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పర్యటనలను మరింత వేగవంతం చేయాలని, తల్లిదండ్రుల నుండి, సమాజంలోని మేధావి వర్గం, ఉపాధ్యాయుల నుండి తగిన సూచనలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భాన్ని తల్లిదండ్రులు, మేధావులు ఉపయోగించుకుని విద్యా రంగ అభివృద్ధి కోసం విద్యా కమీషన్ కు తమ అభిప్రాయాలను తెలియజేయాలని అన్నారు.
అదేవిధంగా 317 జీఓ వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరినీ తమ సొంత జిల్లాలకు పంపించాలని అన్నారు. ఉద్యోగుల పట్ల మరణ శాసనంగా మారిన సేపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని కోరారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రి ప్రైమరీ తరగతులను ప్రారంభించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడిని కేటాయించాలన్నారు. పండిట్, పీఈటీ అప్గ్రేడేషన్ కి ముందున్న స్కూల్ అసిస్టెంట్, తెలుగు, హిందీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల ప్రమోషన్ల కోసం ఎస్జీటీలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను ప్రకటించాలని, పీఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించుకోవాలన్నారు. ఆర్ధిక శాఖ వద్ద పెండింగ్ లో ఉండి మూలుగుతున్న బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ మంజూరు చేయాలని, ఎస్ఎస్ఏ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను, ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, రెసిడెన్షియల్ స్కూల్ టైమింగ్స్ సాధారణ పాఠశాలల మాదిరి మార్చాలని, రెసిడెన్షియల్, కేజీ బీవీ, యుఆర్ఎస్ ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ, హాలిడే డ్యూటీ నుంచి మినహాయించాలని, ఎయిడెడ్ టీచర్స్ కి ప్రతి నెల వేతనాలు అందించాలని, మోడల్ స్కూల్ టీచర్స్ కి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించాలని, ఎయిడెడ్, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్ల తో భర్తీ చేయాలని, మధ్యాహ్న భోజన చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు, బాధ్యులు పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక...
అనంతరం రాబోయే రెండు సంవత్సరాలకు జిల్లా ఆఫీస్ బేరర్స్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఆకుల బాబు, ప్రధాన కార్యదర్శిగా సాయిలు, ఉపాధ్యక్షులుగా బి.వెంకటరెడ్డి, ఏమిలియా, కోశాధికారిగా ఎన్.వి.రూప్ సింగ్, ఎఫ్ డబ్లుఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గా కె.రాజవర్ధన్, జిల్లా కార్యదర్శులుగా ఎం.గోపాల్, వై.గోపాల్, యన్.నారాయణ, ఎస్.బాలయ్య, సాయి గౌతమ్, దయాకర్, బి.నాంపల్లి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా టీ.సుధాకర్, బసవయ్య, సభ్యులుగా గణపతి, ఎఫ్ డబ్లు ఎఫ్ జిల్లా కన్వీనర్ గా ఎం.గోపాల్ ఎన్నికయ్యారు.