తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధే ఏకైక లక్ష్యంగా పనిచేసి, చక్కని ఫలితం సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ యూనివర్శిటీ వైస్-ఛాన్స్ లర్ డాక్టర్. వి. యాదగిరి రావుకు సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధే ఏకైక లక్ష్యంగా పనిచేసి, చక్కని ఫలితం సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ యూనివర్శిటీ వైస్-ఛాన్స్ లర్ డాక్టర్. వి. యాదగిరి రావుకు సూచించారు. ప్రభుత్వం యాదగిరి రావును టీయూ కు వీసీ గా నియమించడంతో.. సోమవారం యూనివర్శిటీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీసీ ఆచార్య. టి. యాదగిరిరావు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదారాబాద్ లోని ఆయన నివాసంలో పుష్పగుచ్చమిచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్టోందన్నారు. అందుకే విద్యా రంగంలో విశేషమైన అనుభవం ఉన్న ఆచార్యులను మాత్రమే యూనివర్సిటీలకు అత్యంత పారదర్శకంగా ఉపకులపతులుగా నియామకం చేపట్టామన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు..ఈ సందర్భంగా వీసీ ఆచార్య యాదగిరిరావుని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. విద్యా రంగంలో అత్యంత అనుభవం ఉన్న మీరు తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో.. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడం కొరకు నిరంతరం కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యారంగ అభివృద్ధికి పాటుపడాలన్నారు. విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల ఏర్పాటుకు సరైన ప్రణాళికలతో ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.