తెలంగాణ యూనివర్సిటీ భూములకు ఎసరు.. అక్రమార్కులతో రిజిస్ట్రార్ కుమ్మక్కు

Update: 2024-09-27 11:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జాకు పాల్పడుతున్న వారితో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కుమ్మక్కయ్యారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం. సుధాకర్ డిమాండ్ చేశారు.

నగరంలోని ఎన్ ఆర్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్శిటీ ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడితే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో తెలంగాణ యూనివర్శిటీని ఏర్పాటు చేసిందని అన్నారు సుధాకర్. డిచ్ పల్లి శివారులో 574 ఎకరాలు భూమిని తెలంగాణ యూనివర్సిటీ కోసం కేటాయించిందన్నారు. యూనివర్సిటీ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఆ భూముల్లో 54 ఎకరాలు తమ సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులు రూపొందించి కబ్జా చేయాలని చూశారని సుధాకర్ పేర్కొన్నారు.

ఈ విషయంపై అప్పట్లో మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వరప్రసాద్ సీరియస్ గా స్పందించారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన అప్పటి తహసీల్దార్ రవికుమార్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రియల్ వ్యాపారులు కోర్టుకు వెళితే కోర్టు సైతం తెలంగాణ యూనివర్శిటీకే అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. ఆ తర్వాత వారు హైకోర్టుకు వెళ్లారని, కోర్టులో యూనివర్సిటీకి అనుకూలంగా అన్ని రికార్డులను అందించి, అందుకు తగిన విధంగా కృషి చేయాల్సిన ప్రస్తుత యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాశారని ఆరోపించారు.

రిజిస్ట్రార్ చేతకాని తనం, ఉదాసీనత కారణంగా 54 ఎకరాల యూనివర్సిటీ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సొంతమయ్యే పరిస్థితి దాపురించిందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ యాదగిరి వైఖరిని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సుధాకర్. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని యూనివర్సిటీ భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా, వక్రమార్గంలో యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయాలని కుట్రలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విద్యార్థి లోకం, ప్రజలు, ప్రజా సంఘాలు, యూనివర్సిటీ కోసం అప్పట్లో పోరాడిన ప్రతి ఒక్క వర్గం చూస్తూ ఊరుకోబోవన్నారు. యూనివర్శిటీ భూములను కాజేయాలనే కుట్ర చేస్తున్న వారికి వ్యతిరేకంగా,వారికి సహకరిస్తున్న వారిపైన కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నాయకులు మురళి, సంధ్యారాణి, విఠల్, గంగాధర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.


Similar News