దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
సీఎం కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ, కామారెడ్డి రూరల్ : సీఎం కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో, కామారెడ్డి జిల్లాలో అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు.
ప్రజా భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల అధికారుల సహకారంతో కామారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాగిన స్వరాష్ట్ర సాధన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలన అన్నింటికీ కలయిక అయిన 'తెలంగాణ మోడల్' నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతుందన్నారు. కరోనా కష్టకాలంలోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందన్నారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు ఇలా కొత్త కొత్త సంస్కరణలను అమలుల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల కామారెడ్డి జిల్లాలో వానా కాలంలో 5.11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారని తెలిపారు.
యాసంగిలో 4.26 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేపట్టారని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా జిల్లాలోనే ఇప్పటివరకూ 10 విడతల్లో సుమారు 2.79 లక్షల మందికి రూ.2,289 కోట్ల ముందస్తు పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాలలో నేరుగా జమ చేశారని తెలిపారు. ఈ యాసంగిలో రూ.252 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతులకు సుస్థిర ఆదాయం రావాలి, మెరుగ్గా బ్రతకాలి అనే ఉద్దేశ్యంతో తెలంగాణాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారిగా ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్ లో రూ.వేయి కోట్లను కేటాయించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జడ్పి చైర్ పర్సన్ శోభ, ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందూప్రియ , డీ.ఎఫ్.వో నిఖిత, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.