అల్లు అర్జున్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదు

సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Update: 2024-12-22 14:47 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ ఓ కళాకారుడని, కళాకారులను పోషించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గతంలో మద్రాసుకే పరిమితమైన తెలుగు చిత్రసీమ హైదరాబాద్ కు రావడానికి ఆనాటి సీఎంలు మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, ఆ తరువాత వచ్చిన విజయ భాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రసీమకు ఎన్నో వెసులుబాట్లు కల్పించారన్నారు. చవక ధరలకే భూములివ్వడంతో హైదరాబాద్ లో వెలిసిన రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియోలు నిర్మితమైనాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం కాదా? అని ప్రశ్నించారు.

    మద్రాసుకే పరిమితమైన అలనాటి నటీనటులు హైదరాబాద్ తరలి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కాదా అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ సినిమా హాలుకు వెళ్లినప్పుడు ఆయన ఏ రకమైన విధి విధానాలు, మార్గదర్శకాలు పాటించకుండా వెళ్లాడని, ఈ కారణంగా ఓ నిండు ప్రాణం పోయిందని అన్నారు. ఆ మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో వారి గురించి మానవీయ కోణంలో ఆలోచించకుండా, ఈ కేసులో కేవలం 8 గంటల పాటు జైల్లో గడిపి వచ్చిన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి ఆయన ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులకు చనిపోయిన మహిళ కుటుంబం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. చావు బతులకు మధ్య బతకడానికి పోరాటం చేస్తున్న పిల్లవాడు గుర్తుకు రాలేదా? కనీసం పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదని అడిగారు. పుష్ప 2 అనేది కమర్షియల్, భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందంటే సినిమా రంగంపైన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు.

కళలను ,కళాకారులను పోషించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది..

బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలు రాజకీయం చేసే విధంగా ఉన్నాయన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన పేద మహిళ గురించి మాట్లాడని బండి సంజయ్ సినిమా రంగంపై ప్రేమను ఒలకబోస్తూ మాట్లాడుతున్నాడని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ , బీజేపీ నాయకులు ఎందుకు చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదో చెప్పాలన్నారు. అల్లు అర్జున్ వ్యవహారానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదని స్పష్టం చేశారు. దీన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ,బీజేపీల అసలు రంగును ప్రజలు గమనిస్తున్నారని, ఎవరేమిటనే విషయం వారికి అర్థమవుతోందన్నారు. 


Similar News