ఆగని మొరం అక్రమ వ్యాపారం..

నిజామాబాద్‌ జిల్లాలో మొరం, మట్టి తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఏ గుట్ట కనిపించినా రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు.

Update: 2024-12-23 02:18 GMT

నిజామాబాద్‌ జిల్లాలో మొరం, మట్టి తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఏ గుట్ట కనిపించినా రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పుతుండడంతో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి. మైన్స్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్‌ చేసి జరిమానా విధించినా మట్టిని టిప్పర్లు ఉండతో నడుపుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏ గుట్ట కనపడినా వారం తిరిగి చూసేసరికి మాయం చేస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, వీరిని పట్టుకోకుండా ఉండేందుకు అధికార పార్టీలో ఓ నాయకుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మొరం మాఫియాతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సైతం లాభపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొరం మాఫియా ఆగడాలు మితిమీరడంతో వనరులు, వృక్ష సంపద కనుమరుగవుతున్నది. మండలంలోని ఆయా గ్రామాల్లో గుట్టల ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లను జేసీబీలతో పెకిలించి మరీ మొరం తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని తరలించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి తెస్తూ అధికారులకు నెలవారిగా మాముళ్లు ఫిక్స్‌ చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

దిశ, కమ్మర్ పల్లి : మండల రెవెన్యూ, ఎస్సారెస్పీ అధికారుల అండదండలు, పలువురు నేతల పేర్లతో పట్టపగలే ప్రభుత్వ సొమ్ము మొరాన్ని అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కమ్మర్ పల్లి, మోర్తాడ్ మండల పరిధిలోని కమ్మర్ పల్లి, తిమ్మాపూర్ గ్రామాల పరిధిలో గల వరద కాలువ గట్టు పై ఉన్న మొరాన్ని ప్రైవేట్ భవన నిర్మాణాల యజమానులకు విక్రయిస్తున్నారు. మండల పరిధిలో వరద కాలువ గట్టులో తవ్వి అక్రమంగా మొరాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని అదునుగా పలువురు మొరం మాఫియా తమ సొంత టిప్పర్లు, జేసీబీలను అనుమతి లేకున్నా వరద కాలువ గట్టున ఉన్న మొరాన్ని తవ్వుతూ దర్జాగా మొరం వ్యాపారం చేస్తున్నారు. పగటి సమయంలో కాకుండా రాత్రి వేళల్లో ప్రైవేట్ పనులకు మట్టిని తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

పగలు కొన్ని టిప్పర్లు కమ్మర్ పల్లి లో గల ఒక ప్రైవేట్ బంకులో ఉంచి, రాత్రి కాగానే తమ అక్రమ మట్టి వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రతినిత్యం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మొరం మాఫియా టిప్పర్లు సగటున ఒక్క రోజుకు 100 కి పైగా ట్రిప్పుల మురారి తరలిస్తున్నారని సమాచారం. స్థానికులకు నేతల పేర్లు చెప్పడంతో అక్రమ మొరం వ్యాపారంపై ఫిర్యాదులు రావడం లేదు. అక్రమ మొరం వ్యాపారం జరిగేందుకు పైనుండి కింది స్థాయి వరకు బలమైన వ్యక్తుల అండదండలు ఉన్నాయని తెలుస్తుంది. రెవెన్యూ చట్టాలు అక్రమ మొరం మాఫియాకు వర్తించినట్టు ఉన్నాయి. ప్రతిరోజు మట్టి రవాణా జోరుగా సాగుతూనే ఉంది. ఈ మొరం దందా పై జిల్లా ఉన్నత అధికారులు కలుగ చేసుకుంటేనే ఆగు నేమో..!

బోర్గాం కే లో అక్రమంగా మొరం దందా..

ఆర్మూర్ : నియోజకవర్గంలోని మాక్లూరు మండలం బోర్గాంకే గ్రామంలో మొరం దందా విచ్చలవిడిగా సాగుతుంది. బోర్గం గ్రామంలోని వాగు శివారులో గత నాలుగు ఐదు రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా మొరం తవ్వకాలు జరుపుతూ టిప్పర్ వాహనాలతో ఇల్లీగల్ గా అమ్మకాలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా, అనుమతులు తీసుకోకుండా ట్రాక్టర్కు రూ.500 టిప్పర్కు రూ.1000 చొప్పున మొరం అమ్మకాలను దర్జాగా మొరం దందా వ్యాపారులు సాగిస్తున్నారు. బోర్గం గ్రామం శివారులోని వాగులో గల మొరంను మొరం అక్రమ దందా వ్యాపారులు అడ్డు అదుపు లేకుండా తరలిస్తున్నప్పటికీ రెవిన్యూ శాఖ అధికారులు తమకేం పట్టనట్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని జోరుగా విమర్శలు వస్తున్నాయి. అక్రమ దందా వ్యాపారులపై చర్యలు తీసుకోవలసిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి సైతం చూడడం లేదని విమర్శలు ఆర్మూర్ నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి.

వాగు శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబి లతో మొరం తవ్వుతూ, టిప్పర్ ,ట్రాక్టర్లతో దర్జాగా అక్రమంగా రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు పొందకుండా అక్రమ మొరం వ్యాపారులు అక్రమంగా మొరాన్ని తవ్వుకుంటూ రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మోరాన్ని తరలిస్తున్న అధికార గణం చూసి చూడనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో జోగుతున్నారంటూ ప్రజల్లో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ అక్రమార్కులు మొరాన్ని తరలించి లక్షలాది రూపాయలు అక్రమంగా దోచుకుంటున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అధికారుల తీరుపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు స్పందించి అక్రమ మొరం వ్యాపారులను కట్టడి చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News