దిశ, బాన్సువాడ: తీగలాగితే డొంక కదిలినట్లు.. బడాపహాడ్‌లో అక్రమాల పుట్ట పగులుతుంది. అవినీతి, అక్రమాల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. దిశ ప్రచురించిన వరుస కథనాలకు అధికార యంత్రాంగం స్పందించి, విచారణ మొదలెట్టింది. అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా ఆదేశాల మేరకు వర్ని తహశీల్దార్ విఠల్ శుక్రవారం బడాపహాడ్‌లో పర్యటించారు. దర్గా వద్ద జరుగుతున్న అక్రమాలపై ఆరా తీశారు. కాంట్రాక్టర్ల దౌర్జన్యాలు, అవినీతి వక్ఫ్ సిబ్బంది వసూళ్ల పై వివరాలు సేకరించారు. వసతుల కల్పన పై సిబ్బందిని ప్రశ్నించారు. భక్తులు పడుతున్న బాధలు తెలుసుకున్నారు. ముఖ్యంగా హుండీ డబ్బుల దొంగతనం, బంగారం, వెండి గుర్రాల ప్రతిమల మాయంపై లోతుగా విచారించారు. నెలకు ఎంత హుండీ డబ్బు వస్తుందనే దాని పై లెక్క తీశారు.
గదుల కిరాయి అద్దె దోపిడీ, మేకల వధశాలలో అధిక వసూళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుండీలో డబ్బులు వేయనిదే దర్గాలోనికి రానివ్వకపోవడం, నిర్బంధంగా హుండీ డబ్బులు తీసుకోవడం లాంటి విషయాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు నిర్లక్ష్యంపై సిబ్బందిని నిలదీశారు. తమ దోపిడీకి అడ్డుగా ఉంటాయనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదని భక్తులు ఆయనకు వివరించారు. వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హుండీ డబ్బులు నిజామాబాద్ తీసుకెళ్లి లెక్కించడం పై స్థానికులు మండిపడ్డారు. దర్గా లో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలపై అన్ని వివరాలు సేకరించిన తహసీల్దార్ ఓ నివేదిక రూపంలో అదనపు కలెక్టర్ కు అందించనున్నారు. బడా పహాడ్ దర్గా దోపిడిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.