నిజామాబాద్ మార్కెట్ కమిటీ పై వీడని సస్పెన్షన్
ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ గా పేరు గడించిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలకమండలి కొత్త కార్యవర్గాన్ని నియమించేందుకు కసరత్తు జరుగుతుందనే చర్చ జిల్లాలో జరుగుతుంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ గా పేరు గడించిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలకమండలి కొత్త కార్యవర్గాన్ని నియమించేందుకు కసరత్తు జరుగుతుందనే చర్చ జిల్లాలో జరుగుతుంది. ఈసారి పాలకవర్గం పదవులను ఉద్యమకారులకు ఇస్తారా? లేక పార్టీ నాయకులకు ఇస్తారా? అనే చర్చ జోరుగా సాగుతుంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా విద్యార్థి ఉద్యమ నాయకులకు ఇచ్చేందుకు కసరత్తు చేసింది. సీఎంవో పేషి వరకు కూడా విద్యార్థి నాయకుడికే పోస్టింగ్ అని అంతా అనుకున్నారు.
కానీ ఏం జరిగిందో తెలియదు కానీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన కులచారి దివ్య దినేష్ కు ఆ పదవి దక్కింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి నాడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఇవ్వడంతో ఉద్యమకారులకు అవకాశం దక్కకుండాపోయింది. అదే సంవత్సరం పాలకవర్గంలో పదవి కోసం మాజీ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏ.ఎస్.పోశెట్టికి ఇస్తారని ప్రచారం జరిగినా ఆయనకు కూడా మొండి చేయి చూపించారు. టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు దక్కడంతో టీఆర్ఎస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే నిజామాబాద్ మార్కెట్ కమిటీకి కేవలం ఏడాదిన్నర మాత్రమే పాలకవర్గం కొలువుదీరింది. దేశంలో ఈనామ్ మార్కెట్ తో పేరు గడించిన నిజామాబాద్ లో సుమారు రూ.250 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఏడాదికి చాలిన మార్కెట్ ఫీజే రూ.13 కోట్ల వరకు ఆధాయం వస్తుంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపు, మక్క, ఆమ్ చూర్, ధాన్యం కొనుగోలు చేస్తుంటారు. దేశంలోనే పేరుగడించిన మార్కెట్ కమిటీకి పాలకవర్గంలో ఉండాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.
గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు, వివిధ సంస్థల చైర్మన్లు తమ రాజకీయ ప్రస్థానాన్ని మార్కెట్ కమిటీ నుంచే ప్రారంభించారు. ఇదే కోణంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవి కొరకు చాలా మంది ఆశవాహులు ఎదురుచూస్తున్నారు. కానీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నాలుగు నియోజకవర్గాల పరిధిలో విస్త`పరిచి ఉండడంతో పదవులు కేటాయించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
అందుకే గత 8 ఏళ్ళ కాలంలో ఒక్కరికే ఏడాది పదవి వరించినా వారికి మరో ఆరు నెలలు పొడగించారు. గత మూడు సంవత్సరాలుగా పాలకమండలి పదవులు భర్తీ చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 17 వ్యవసాయ మార్కెట్ల పదవులు భర్తీ చేస్తూ పాలకవర్గాలు కాలపరిమితి ముగియడంతో కొత్త పాలకవర్గాలను నియమిస్తున్న ప్రభుత్వం నిజామాబాద్ కు వచ్చే సరికి ఆసక్తి చూపడం లేదు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పదవులను భర్తీ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనే చర్చ జోరందుకుంది. ఈ సమయంలో తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థి నాయకులు దానిపై గంపెడాశలు పెట్టుకున్నారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వారు కూడా ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థి నాయకులకు ఒక్క పదవి కూడా ఉమ్మడి జిల్లాలో లభించలేదు.
ఇటీవల కాలంలో యూనివర్సిటీలో కొందరకి తాత్కాలికంగా అడ్జెస్ట్ చేసినా వారిలో తమకు పూర్తి న్యాయం చేయలేదన్న నిరాశలో ఉన్నారు. మార్కెట్ కమిటీ పదవుల కొరకు నలుగురు ఎమ్మెల్యేల ఆశీర్వాదం లభించడం గగనంగా మారింది. దానికి తోడు మార్కెట్ కమిటీ పదవుల్లో ఎమ్మెల్యేలే తమ సంబంధికులకు ఇప్పించుకునేందుకు కసరత్తు చేస్తుండడంతో పదవుల భర్తీ ఆలస్యమౌతుంది. ఇప్పుడు కూడా దీపావళిలోపు మార్కెట్ కమిటీ పదవులను భర్తీ చేస్తారని మంత్రి కేటీఆర్ వద్దకు ఆ ఫైల్ వెళ్లిందని తెలిసిన తర్వాత చాలా మంది పైరవీలను షురూ చేశారు.
ఈసారైనా విద్యార్థి నాయకులకు వస్తాయా? పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక ప్రజాప్రతినిధుల బంధువులకే పాలకవర్గంలో కొలువులు దక్కుతాయనేది జోరుగా చర్చ జరుగుతుంది. జాతీయ పార్టీ సన్నాహాలతో పాటు దసరా ఉత్సవాలు ముగిస్తే కానీ దానికి తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.