మహిళల పై అత్యాచార నిరోధానికి కఠిన చట్టాలు తేవాలి.. సీఐటీయూ

దేశంలో రోజురోజుకూ మహిళల పై, యువతుల పై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు.

Update: 2024-09-09 13:22 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశంలో రోజురోజుకూ మహిళల పై, యువతుల పై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. మహిళల పై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నిజామాబాద్ నగరంలోని జోన్ 1 లో సోమవారం మున్సిపల్ కార్మికుల వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ దేశంలో మహిళలు, పిల్లలపై పెరుగుతున్న క్రూరమైన హింస, పని ప్రదేశాల్లో మహిళల పై కొనసాగుతున్న వివక్ష భయాందోళన కలిగించే విధంగా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా నగరంలోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్ పై ఇటీవల జరిగిన హత్యాచార ఘటన, మహారాష్ట్రలోని బడ్లాపూర్, థానే నగరాల్లో నాలుగేళ్ల చిన్నారుల పై అత్యాచారం, యూపీలో నర్సుపై అత్యాచారం వంటి ఘటనలు దారుణమని నూర్జహాన్ అన్నారు.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం వర్నిలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ రక్షిత మృతి ఘటనలు పరిశీలిస్తే ప్రభుత్వ వ్యవస్థలు నేరస్థులకు బహిరంగంగానే మద్ధతునిస్తున్నాయన్న విషయం స్పష్టమవుతోందని నూర్జహాన్ ఆరోపించారు. ఇప్పటికైనా మహిళల పై హింసను అరికట్టడానికి అవసరమైన కఠిన చట్టాలను తీసుకురావాలని, లైంగిక హింస కేసుల్లో దోషులకు రాజకీయాలతో సంబంధం లేకుండా నిజాయితీగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆజాద్ మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News