భారీ వర్షాలు.. సిద్ధరామేశ్వరాలయానికి నిలిచిపోయిన రాకపోకలు

తుఫాన్ ప్రభావంతో దంచి కొట్టిన వర్షం వలన వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండగా, చెరువులు కుంటలు వరద నీటితో జలసిరిని సంతరించుకున్నాయి.

Update: 2024-09-01 15:44 GMT

దిశ, భిక్కనూరు : తుఫాన్ ప్రభావంతో దంచి కొట్టిన వర్షం వలన వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండగా, చెరువులు కుంటలు వరద నీటితో జలసిరిని సంతరించుకున్నాయి. శనివారం రాత్రి 9 గంటలకు మొదలైన వాన, ఆదివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా కురిసింది. కుండపోతగా కురిసిన వర్షాల వలన మండలంలోని ఎడ్ల కట్ట వాగు పొంగి ప్రవహించడంతో అంతంపల్లి నుంచి లక్ష్మీ దేవునిపల్లి వెళ్లే రోడ్డు కల్వర్టు పై నుంచి భారీగా వరద నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా వరద నీటి ఉధృతికి కల్వర్టు కొద్ది దూరం కొట్టుకుపోయింది. దాసనమ్మ కుంటకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు, రాత్రికి రాత్రే జేసీబీని తెప్పించి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరకుండా గండి కొట్టించారు. వరద ఉధృతికి రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయం నుండి సిద్ధరామేశ్వరాలయానికి వెళ్లే రోడ్డు పూర్తిగా తెగిపోయి, ఆలయానికి వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి.

దీంతో శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తులు, హైవే నుంచి గుర్జకుంట మీదుగా స్వామివారి దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతేకాకుండా అండర్ పాస్ బ్రిడ్జి కింద మోకాలులోతు నీళ్లు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డు పక్కన పార్క్ చేసుకొని కాలినడకన ఎల్లమ్మ ఆలయానికి వెళ్లాల్సి వచ్చింది. 37 సంవత్సరాల తర్వాత బొబ్బిలి చెరువు అలుగు పారింది. కొత్తచెరువు, అలుగు పారే ప్రాంతంలో కట్టకు గండి పడేప్రమాదం ఏర్పడడంతో తహశీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, ఎస్ఐ సాయికుమార్, ఏఎస్ఐ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మొరం కంకర తెప్పించి, చెరువు కట్టను బందోబస్తు చేయించారు. మండలంలోని జంగంపల్లిలో రెండు, భిక్కనూరులో ఒక పెంకుటిండ్లు కూలిపోయాయి. అధికార యంత్రాంగం సైతం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలను చేపట్టింది.


Similar News