తెరుచుకోనున్న ఎస్సారెస్పీ గేట్లు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక జారీ
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్ ఆర్ ఎస్ పీ) గేట్లు తెరుచుకోనున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎస్ ఆర్ ఎస్ పీ ఎగువ భాగం నుండి ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు నమోదైన వరద ఇన్ ఫ్లో 1,57,274 క్యూసెక్కులు. కాగా, ఇన్ ఫ్లో పెరుగుతూ పోతుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా, ఇప్పటికే వాటర్ లెవల్ 1087.9 అడుగులు, 69.57 టీఎంసీలకు చేరుకుంది. 2,353 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ లో భాగంగా తాగునీటి అవసరాలకు, ఇతర అవసరాలకు అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.
గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం..
ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్సారెస్పీ ఇన్ ఫ్లో 83,636 క్యూసెక్కులు కాగా, అర్ధరాత్రి 12 గంటలకు 94,746 క్యూసెక్కులుగా నమోదయింది. ఒంటిగంటకు 94,746 క్యూసెక్కులు, 2 గంటలకు, 3 గంటలకు నిలకడగా 1,03,988 క్యూసెక్కులు, సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు 1,48,210 క్యూసెక్కులుగా నమోదయింది. 5 , 6 గంటలకు నిలకడగా 1,57,274 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం దాదాపు 90 శాతానికి చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం ముందుగా ప్రాజెక్టు గేట్లు కొన్నింటిని తెరిచేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు దిగువలో గోదావరి నది పరివాహ ప్రాంతాల్లోని పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపరులు గోదావరి నది పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.