ఆర్మూర్‌లో రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్.. ఏవోలకు కీలక బాధ్యతలు
బ్యాంకు రుణాలున్న రైతులకు మాఫీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంది. ...
దిశ ఆర్మూర్: బ్యాంకు రుణాలున్న రైతులకు మాఫీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంది. మూడో విడుత రుణమాఫీ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 2.80 వేల పైచిలుకు మంది రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.60 వేలమంది రైతులు వ్యవసాయ పంట రుణాలు తీసుకొని పంటల సాగు చేపడుతున్నారు. గత నెల రోజులుగా జిల్లాలో పంట రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మూడు విడతల్లో రైతులకు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. జిల్లాలో గత నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విడతల వారీగా అందిస్తున్న రుణమాఫీ జిల్లాలో 83,061 మంది రైతులకు నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రుణమాఫీ విధి విధానాలతో రైతులకు అందిస్తామన్న రుణమాఫీ వ్యవసాయ పెత్తందారులను కొట్టి.. నిరుపేద రైతులకు పంపిణీ చేస్తున్నట్లుగా ఉందని నిజామాబాద్ జిల్లాలోని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించు కుంటున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేసిన తొలి రోజున తొలి సంతకం పెట్టి ఉమ్మడి రాష్ట్రంలోని రైతులందరికీ అప్పట్లో ఒకే దఫాలో రుణమాఫీ చేసి రైతును కంటికి రెప్పలా కాపాడుకొని వారి ఆదరణను చూరగోన్నాడు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రైతాంగానికి రుణమాఫీ అంశంలో నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్యత కింద అందిస్తూ విడతల వారీగా పంపిణీ చేస్తున్న రుణమాఫీ నగదు విడుదల నిరుపేద, మధ్యతరగతి రైతాంగంలో చెప్పలేని ఆనందం నెలకొంది.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతాంగం పట్ల చూపించిన చొరవతో పొందిన ఆదరణను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అందు కుంటారని రుణమాఫీ పథకంలో లబ్ధి పొందుతున్న జిల్లాలోని రైతాంగం సంతోషం వెలిబుచ్చుతున్నారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేసేందుకు తీవ్ర కసరత్తు చేపట్టి గత నెల రోజులుగా మూడు విడతలుగా భూస్వామి పెద్దందారి రైతులకు కోత పెట్టి నిరుపేద రైతాంగానికి ఈ మూడు విడతల్లో ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చింది.
దీని కోసం గత నెల 18వ తేదీన లక్షలోపు 44 ,469 మంది రైతుల పంట రుణాలను, 31న 1.50 వేల లోపు 22,868మంది రైతుల పంట రుణాలను, ముందుగా ప్రకటించిన విధంగానే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 15న రూ.2లక్షలలోపు 15,724మంది రైతుల పంట రుణాలను అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ డబ్బులను రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ రుణమాఫీ ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిరుపేద మధ్యతరగతి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం కోటి ఆశలతో రైతాంగం కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఐదేళ్లు పూర్తి అయిన రుణమాఫీ పూర్తిస్థాయిలో రైతాంగానికి అందించలేక పోయింది.
దీంతో గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి ప్రభుత్వం ఏర్పాట య్యాక రెండు మూడు రోజుల్లోనే రుణమాఫీని పూర్తిస్థాయిలో క్లియర్ చేస్తామని రైతులకు చెప్పారు. కానీ 2018 సార్వత్రిక ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి, నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని బిఆర్ఎస్ పెద్దలు చెప్పిన ఐదేళ్లు పూర్తయిన రుణమాఫీ సంపూర్ణంగా చేయలేక పోయింది. పైగా 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో సైతం రుణమాఫీ అంశాన్ని బి ఆర్ఎస్ పార్టీ వారి మేనిఫెస్టోలో పెట్టలేక పోయింది.
ఈ విషయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతుల్లో తీవ్రంగా చర్చ జరిగింది. దీంతో 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటామని ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రైతులకు తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించి రైతులను ఆకర్షించేలా ముందుకు వెళ్లారు. ఎన్నికలు పూర్తయ్యాయి బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీని చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల రోజులుగా మూడు విడతల్లో విస్తృతంగా వడపోత కార్యక్రమాలను చేపట్టి నిరుపేద రైతాంగానికి ప్రథమ ప్రాధాన్యత కింద రుణమాఫీ నిధులను వారి వారి బ్యాంకుల ఖాతాల్లో జమ చేసింది.
రుణమాఫీ కానీ రైతులకై స్పెషల్ డ్రైవ్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేపట్టిన రుణమాఫీ విషయంలో రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రభుత్వ పెద్దలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.దీంట్లో భాగంగా రైతులకు సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కుటుంబల వివరాలు, బ్యాంకుల్లోని లోన్లలో పేర్ల తప్పుడు వివరాలపై రుణమాఫీ కానీ రైతుల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. రైతులు అందించిన ఫిర్యాదులపై స్పెషల్ డ్రైవ్ పెట్టి అర్హులైన రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేసేందుకు అధికార యంత్రాంగం ముందుకు వెళ్లనుంది. ఈ వ్యవహారం అంతా ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల్లోని ఏఓలకు బాధ్యతలు అప్పగించి, అర్హులకు సంబంధించిన వీలైనన్ని సమస్యలను పరిష్కరించి రుణమాఫీ వర్తించేలా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నుంచి, వ్యవసాయ శాఖ ఉన్నదా అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. త్వరలోనే ఉమ్మడి జిల్లా పరిధిలో రుణమాఫీ కానీ రైతుల నుంచి అధికారులు ఫిర్యాదులను స్వీకరించి స్పెషల్ డ్రైవర్ నిర్వహించి అర్హులైన వారందరికీ రుణమాఫీ నిధులను అందేలా చేయనున్నారు.
రుణమాఫీ రైతులు తొందర పడొద్దు: నరేష్, ఏఈఓ ఆర్మూర్
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీలో విడతలవారీగా చేపట్టాం. రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రుణమాఫీ కానీ రైతులు ఫిర్యాదు చేస్తే వారి ఆధార్ కార్డు, బ్యాంకు లోన్‌లో పేర్లు, కుటుంబాల వివరాలను పరిశీలించి.. అర్హులైన రైతులకు రుణమాఫీ వచ్చేలా చూస్తాం.