అయోమయంలో వెయ్యి మంది విద్యార్థుల భవితవ్యం..?
ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు గత నెల చివరితో ముగిసింది. ప్రస్తుతం రూ.500 ఆపరాద రూసుముతో ఫీజులు చెల్లించాలని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు గత నెల చివరితో ముగిసింది. ప్రస్తుతం రూ.500 ఆపరాధ రూసుముతో ఫీజులు చెల్లించాలని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ బోర్డు ఇప్పటికి కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అఫ్లియేషన్ ఇవ్వలేదు. విద్యా సంవత్సరం ముగింపుకు మరో మూడు నెలలు గడువు ఉన్నప్పటికి అఫ్లియేషన్ల విషయంలో బోర్డు నాన్చుడు ధోరణితో వేల మంది విద్యార్ధుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దాటవేత ధోరణితో అఫ్లియేషన్ల విషయం ఎటు తేలక.. చాలా మంది విద్యార్ధులు గుర్తింపు లేని కళాశాలలో అడ్మిషన్‌లు పొందారు.
బోర్డు మాత్రం వారి ఫీజు స్వీకరించలేదు.. కానీ వారికి కళాశాలల యాజమాన్యాలు మాత్రం అడ్మిషన్‌లు ఇచ్చి తరగతులు బోధిస్తు ఫీజులను వసూలు చేశారు. విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కావాలంటే ఖచ్చితంగా అఫ్లియేషన్ ఉండాలి. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు పొందని కాలేజిలలోని అడ్మిషన్‌లను మిక్స్‌డ్ అడ్మిషన్‌లుగా అభివర్ణిస్తున్న బోర్డు అధికారుల తీరుతో నిజామాబాద్ జిల్లాలో వెయ్యిమంది విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 10 వరకు జూనియర్ కళాశాలలు ఎలాంటి అప్లియేషన్‌లు లేకుండానే రన్ అవుతున్నాయి. ఒక్క నిజామాబాద్‌లోనే 8 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో రెండు జూనియర్ కళాశాలలో జీరో అడ్మిషన్‌లు కాగా.. నవిపేట్‌లో ఒకటి సహకార కళాశాల కాగా మిగిలిన ఐదు జూనియర్ కళాశాలలో అడ్మిషన్‌లు ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో క్రిసేంట్ జూనియర్ కళాశాల, ఆర్మూర్‌లో విజేత, బోదన్ పట్టణంలో మాస్టర్స్, చైతన్య, స్టాండర్డ్ కళాశాలలకు అప్లియేషన్ లేవు. అక్కడ సూమారు 700 మంది విద్యార్ధులు ఇంటర్ చదువుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రెండు జూనియర్ కళాశాలలకు అప్లియేషన్ లభించలేదు.
కానీ అడ్మిషన్‌లను తీసుకుని దర్జాగా కళాశాలలను నడుపుతున్న.. బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని వలన చాలామంది విద్యార్ధులకు తామ కళాశాలలకు బోర్డు గుర్తింపులేదు అన్న విషయం తెలియకపోవడం దారుణం. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులను వసూలు చేసిన సదరు కళాశాలలు.. ఈ విషయాన్ని దాచి ఏకంగా పరీక్ష ఫీజులను వసూలు చేసినట్లు తెలిసింది. ఇప్పుడు సదరు కళాశాలలకు అసలు గుర్తింపు లేదన్న విషయం తెలియడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై నిజామాబాద్ డీఈవో రఘురాజ్‌ను వివరణ కోరగా సంబంధిత కళాశాలల అప్లియేషన్‌ల వ్యవహరం ఇంటర్ బోర్డుకే తెలుసని చెప్పారు.