సైలెంట్ కిల్లర్ . . . కేవీఆర్

కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను ఓడించి వెంకటరమణారెడ్డి సైలెంట్ కిల్లర్ గా పేరు గడించారు.

Update: 2023-12-03 15:17 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను ఓడించి వెంకటరమణారెడ్డి సైలెంట్ కిల్లర్ గా పేరు గడించారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి రెండవసారి అదే స్థానం నుంచి మహామహులను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2018లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడంలో నిమగ్నమైన కేవీఆర్ తన గెలుపు కొరకు తానే బాటలు ఏర్పర్చుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి కుల సంఘానికి, దేవుని గుళ్లకు కోరిన విధంగా విరాళాలు కాకుండా తానే స్వయంగా నిర్మాణ పనులు చేయించి అందరి తలలో నాలుకలా మారారు. కామారెడ్డి నియోజకవర్గంలో అధికార పార్టీ చేసిన తప్పిదాలపై ప్రజలతో కలిసి పోరాడడంలో వెంకటరమణారెడ్డి ముందున్నారు.

    అధికార పార్టీ ఎమ్మెల్యే, అతని అనుచరులు చేసిన ఆగడాలను ఎత్తి చూపుతూ పలుమార్లు మున్సిపల్ కౌన్సిల్ ముందు ఆందోళనలు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూపాయి వడ్డీ రుణాల కోసం రాష్ట్రంలోనే ఆందోళన చేసిన ఏకైక నేతగా వెంకటరమణారెడ్డి పేరు గడించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రజలతో కలిసి పోరాటం చేసి వారి మన్ననలు పొందారు. అప్పటి నుంచే ప్రజలతో ఉన్న వెంకటరమణారెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతానని ప్రకటించినా వెనుకడుగు వేయకుండా తానే బరిలో ఉంటానని ప్రకటించి నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా స్థానికుడైన షబ్బీర్ అలీ సీఎం కేసీఆరే పోటీ చేస్తున్నాడని ఏకంగా నిజామాబాద్ కు వలస వెళ్లారు. కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ది కొరకు రూ.150 కోట్ల సొంత ప్లాన్ అమలు చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చి వారిని తన వైపు తిప్పుకోవడంలో వెంకటరమణారెడ్డి సఫలమయ్యారు.

     సీఎం కేసీఆర్ తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో నిలుస్తారని తేలడంతో ఇక్కడ బీజేపీ అగ్రనేతలను దించుతామని ఆ పార్టీ యోచించినా తానే పోటీ చేస్తానని బరిలో నిలిచారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన వెంకట రమణారెడ్డికి ముక్కుసూటి మనస్తత్వం. జిల్లా పరిషత్ చైర్మన్ గా అధికార పార్టీ నాయకులే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడితే దాని కోసం పోరాటం జరిపి తన పదవిని త్యజించారు. బీజేపీలోకి రాకముందు రెండు పార్టీలు మారిన వెంకటరమణారెడ్డి స్థానికంగా లోకల్ లీడర్ గా ప్రాచుర్యం పొందారు. దానినే ప్రచార అస్త్రంగా మార్చుకుని కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే నినాదంతో పోరాడారు. సీఎం కేసీఆర్ గెలిచినా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గెలిచినా నియోజకవర్గానికి వారు టూరిస్టు లీడర్లు అవుతారు కానీ లోకల్ లీడర్లు కారంటూ ప్రచారం చేసి సెంటిమెంట్ తో ఓటర్లను ఆకట్టుకున్నారు. అంతేగాకుండా ఆ ఇద్దరు లీడర్లలో

    ఎవరు గెలిచినా కామారెడ్డికి ఉప ఎన్నిక తప్పదని, డెవలప్ మెంట్ కావాలంటే తానే సొంత ప్రణాళికను అమలు చేస్తానని ప్రకటించి వారి ఓట్లను రాబట్టుకోవడంలో విజయం సాధించారు. కామారెడ్డి నియోజకవర్గంలో వెంకటరమణారెడ్డి గెలుపును బీజేపీ గెలుపు కంటే ఆయన సొంత చరిష్మా నే కారణమన్న వాదనలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని కామారెడ్డి బహిరంగ సభకు హాజరు కాగా అక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డిల సభలకన్నా జనాలను రప్పించుకోవడంలో కేవీఆర్ విజయం సాధించి తన గెలుపు బాటను తానే వేసుకున్నారు. అంతేగాకుండా కామారెడ్డికి ఉప ఎన్నిక లేకుండా చేశారని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. కామారెడ్డి ఓటర్లు విలక్షణ తీర్పుతో సీఎం కేసీఆర్ ను ఓడించి వెంకటరమణారెడ్డికి పట్టం కట్టడంతో ఇప్పుడు ఆయనపై బాధ్యతలు పెరిగాయి. 


Similar News