నాలుగేళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడాం : షబ్బీర్ అలీ

గత నాలుగు సంవత్సరాల కామారెడ్డి మున్సిపాలిటీ అవినీతి పాలనకు చరమగీతం పాడటం జరిగిందని, మరో ఎనిమిది నెలల్లో కామారెడ్డి మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Update: 2024-04-15 13:23 GMT

దిశ, కామారెడ్డి క్రైమ్ : గత నాలుగు సంవత్సరాల కామారెడ్డి మున్సిపాలిటీ అవినీతి పాలనకు చరమగీతం పాడటం జరిగిందని, మరో ఎనిమిది నెలల్లో కామారెడ్డి మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికైన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపాలిటీలో 50 మంది ఓటింగ్ కు 29 ఓట్లు వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా త్వరలోనే ఉరుదొండ వనిత ఎంపిక అవుతారన్నారు. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి కామారెడ్డి అభివృద్ధి పనులపై సమావేశమవుతామన్నారు. మున్సిపాలిటీలో ప్రజలకు సరిపడా నీళ్లు రావడం లేదన్నారు.

ఎన్నికల తర్వాత సీఎం సమక్షంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 24 గంటల లైటింగ్ సౌకర్యం కల్పించి జాతీయ స్థాయి స్టేడియంకు కావాల్సిన వసతులు కల్పిస్తామన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News