కుటుంబాన్ని బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్

అప్పుల బాధ తాళలేక ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సురేశ్ (53), హేమలత (45) కొడుకు హరీశ్ (22) బలవన్మరణానికి పాల్పడ్డారు.

Update: 2024-10-05 05:10 GMT

దిశ, వెబ్ డెస్క్/బోధన్: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మనస్ఫర్థలు.. ఇలాంటి కారణాలతో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలున్న కుటుంబాలు వాటిని భరించలేక.. చావే శరణ్యమనుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఓ కుటుంబం అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు హరీశ్ (25) బెట్టింగ్ కు అలవాటుపడి చేసిన అప్పుల్ని తీర్చలేక తల్లిదండ్రులు సురేశ్ (53), హేమలత (48) కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగననేని సురేష్, హేమలత తమకున్న అర ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కొడుకు హరీష్ ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటుపడి లక్షల్లో అప్పులు చేయగా.. కొంత అప్పును ఉన్న అరఎకరం పొలాన్ని అమ్మేసి తీర్చారు. ఇంకా అప్పులు ఉండటంతో మనస్తాపానికి గురై.. శుక్రవారం రాత్రి తమ ఇంటిలో ముగ్గురూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాస్.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News