జీజీహెచ్‌లో భద్రత కరువు

జీజీహెచ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాపునకు గురి కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Update: 2024-10-20 02:48 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జీజీహెచ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాపునకు గురి కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఆస్పత్రితోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. రోజులో 2,500 మందికి పైగా ఔట్ పేషంట్లు రిజిస్ట్రేషన్ తో రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో ఔట్ పేషంట్ల రిజిస్ట్రేషన్ నమోదై రికార్డు సృష్టించిన హాస్పిటల్ అది. రోజుల్లోనూ ప్రతిరోజూ కనీసం 1,500 నుంచి 1,800వరకు ఔట్ పేషంట్.. వందల సంఖ్యలో ఇన్‍ పేషంట్లు వారి కోసం వచ్చి పోయే రోగుల బంధువులు, వందల సంఖ్యలో ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది. రద్దీగా ఉండే ఏడు అంతస్తుల మేడ లాంటి ప్రభుత్వ ఆసుపత్రి భవనం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్). రోగులకు వైద్య సేవలందించే విషయంలో ఫర్వాలేదు.

భద్రత విషయంలో అధ్వానం అనే టాక్ ను సొంతం చేసుకుంది. గడిచిన నాలుగు నెలల్లో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రి నుంచి కిడ్నాప్ కు గురయ్యారని భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ప్రతిరోజు హాస్పిటల్ లో ఎప్పుడు చూసినా రోగులతో హడావిడి వాతావరణం కనిపిస్తుంది. జిల్లా ప్రజలకే కాకుండా నిర్మల్, జగిత్యాల్, కామారెడ్డి జిల్లాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు జిల్లాల్లోని పలు గ్రామాల నుంచి వైద్య సేవల కోసం వస్తుంటారు. జీజీహెచ్ లో ప్రభుత్వం సాంక్షన్ చేసిన12 క్లినికల్ డిపార్ట్‌మెంట్లున్నాయి. స్థానికంగా రోగుల అవసరాల కోసం న్యూరాలజీతో పాటు పలు విభాగాల సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్లిష్టమైన ఆపరేషన్లు, ఖరీదైన ఆపరేషన్లు నయా పైసా ఖర్చు కాకుండా వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అప్పుడప్పుడూ ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రజల్లో వైద్యంపై విశ్వాసాన్ని చూరగొంటున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే..

నాణేనికి మరోవైపు.. భద్రతా వైఫల్యం

జీజీహెచ్ లో సానుకూల అంశాలు ఎన్నున్నాయో అంతకు రెట్టింపు ప్రతికూల అంశాలున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బందితో ఇబ్బందులు. ఇన్ పేషంట్ల పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వ్యవహారం వంటివెలా ఉన్నా.. భద్రత విషయంలో అనేక జీజీహెచ్ విమర్శలకు గురవుతోంది. ఆస్పత్రి ఇన్‍ పేషంట్లతో పాటు వచ్చిన బంధువుల పిల్లలకు భద్రత కరువైందనే ఆరోపణలున్నాయి. ఆరోపణలకు తగ్గట్లుగానే గడిచిన మూడు, నాలుగు నెలల్లో ఆసుపత్రి నుండి ఇద్దరు పిల్లలు కిడ్నాప్ కు గురయ్యారు. తాజాగా శనివారం కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన లక్ష్మీ అనే ఓ మహిళ అనారోగ్యం కారణంగా వైద్యం కోసం తన భర్త రాజు, ఏడాది వయసున్న కొడుకు మణికంఠ తో కలిసి శనివారం నిజామాబాద్ లోని జీజీహెచ్ కు వచ్చింది. బాగా రాత్రి కావడంతో తన కొడుకు మణికంఠను పక్కలో పడుకో బెట్టుకుని తండ్రి రాజు ఆస్పత్రి ఆవరణలోనే పడుకున్నాడు.

తెల్లారే లోపు కిడ్నాప్..

రాత్రి పడుకుని తెల్లారి లేచేసరికి తన పక్కలో పడుకున్న కొడుకు మణికంఠ కిడ్నాప్ కు గురయ్యాడు. కనిపించకుండా పోయిన బాబు కోసం ఆస్పత్రిలో, ఆస్పత్రి ఆవరణలో ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు శనివారం రాత్రి పన్నెండు గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మణికంఠ ను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. కొద్ది నెలల క్రితం కూడా ఇదే హాస్పిటల్ నుంచి ఇదే రీతిలో బంధువుల పక్కన పడుకున్న పిల్లాడిని అపరిచిత వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. పోలీసులు చాకచక్యంగా ఇన్వెస్టిగేట్ చేయడంతో కిడ్నాప్ కు గురైన పిల్లాడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా మరో పిల్లాడిని ఆస్పత్‌రి ఆవరణ నుంచి కిడ్నాప్ చేయడంతో భద్రతా పరమైన డొల్లతనంపై ఆస్పత్రి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది.

జీజీహెచ్ లోనే ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు..

నేర పరిశోధనలో పోలీసులకు అత్యంత విశ్వసనీయంగా సహకరించే సాంకేతికత సీసీ కెమెరాల వ్వవస్థ. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేనన్ని సీసీ కెమెరాలు జీజీహెచ్‌లోనే ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ చెపుతున్నారు. ఏడంతస్థుల్లో కొనసాగుతున్న జీజీహెచ్ లో భద్రత కోసం 153 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 53 మంది సెక్యూరిటీ సిబ్బంది, 12 మంది పోలీసులు జీజీహెచ్ లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సీసీ కెమెరా వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక చాలా కేసుల పరిశోధనలో పోలీసుకు ఇన్వెస్టిగేషన్ ఈజీ అయ్యిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా జీజీహెచ్ లాంటి చోట కిడ్నాప్ వ్యవహారంలో సీసీ టీవీ ఫుటేజీ ఎప్పటిలాగే పోలీసులకు సహాయకారిగా ఉపయోగపడుతోంది. కొద్ది నెలల క్రితం జరిగిన పిల్లాడి కిడ్నాప్ వ్యవహారం లో సీసీ ఫుటేజీ ఆధారంగానే పిల్లాడిని ట్రేస్ చేసి పేరెంట్స్ కు అప్పగించారు.

ఇప్పుడు కూడా ఇదే సాంకేతికత ఆధారంగా పోలీసులు కేసును చేధించే పనిలో పడ్డారు. నగరంలోని వన్ టౌన్ పోలీసులు కేసు విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాప్ కు గురైన పిల్లాడి ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు. జీజీహెచ్ లో శనివారం జరిగిన పిల్లాడి కిడ్నాప్ వ్యవహారం పై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ను వివరణ కోరగా, ఈ కిడ్నాప్ వ్యవహారం ఆస్పత్రిలో జరగలేదని, అసలు వారు మా పేషంట్స్ కాదన్నారు. బాధితులు మాకు ఫిర్యాదు కూడా చేయలేదని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. భద్రత విషయంలో ఇంత పెద్ద ఆస్పత్రిలో అన్ని చూసుకోవాలంటే కష్టం కదా అన్నారు. భద్రత విషయంలో అప్రమత్తంగానే ఉన్నామని ఆమె చెపుతున్నారు.

జీజీహెచ్‌లో ఎన్ని జరిగినా తీరు మారదా?

ఆస్పత్రిలో వైద్యం మాటెలా ఉన్నా ఆస్పత్రికి వచ్చే పేషంట్లను ఆస్పత్రి సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు మాత్రం ఇన్ పేషంట్లుగా చికిత్స పొందుతున్న ఏ పేషంట్ ను అడిగినా చెప్పే మాటని ఇక్కడి వారంటారు. పేషంట్లకు, పేషంట్ల బంధువులకు ఇవ్వాల్సినంత కనీస మర్యాద కూడా ఇక్కడి సిబ్బంది ఇవ్వరనే విమర్శలున్నాయి. గతంలో ఆస్పత్రి నుంచి పేషంట్లు అదృశ్యమైన సంఘటనలు, ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలతో పాటు కరోనా సమయంలో చనిపోయిన వ్యక్తి డెబ్ బాడీని ప్యాసింజర్ ఆటో లో కింద అడ్డంగా పడుకోబెట్టి అమానవీయ పద్ధతిలో తరలించడం అందరినీ కదిలించేలా చేసింది ఈ సంఘటనపై అప్పట్లో జీజీహెచ్ అనేక విమర్శలు మూటగట్టుకుంది. ఎన్ని అనుభవాలెదురైనా జీజీహచ్ లో మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Similar News