నెత్తురోడుతున్న రహదారులు.. గాలిలో కలుస్తున్న నిండు ప్రాణాలు

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడా రాడా అని ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

Update: 2024-08-29 02:00 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడా రాడా అని ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలుస్తూనే ఉన్నాయి. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించక పోవడం... అతివేగంగా వాహనాలు నడపడం, డ్రంకెన్‌ డ్రైవ్‌, డ్రైవింగ్‌ శిక్షణ లేని వ్యక్తులు, మైనర్లు వాహనాలు నడపడం.. కారణాలేమైనా ప్రమాదాలలో నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రహదారులు రక్తదారులుగా, మృత్యుమార్గాలుగా మారుతున్నాయి. జిల్లాలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు జనాలను భయపెడుతున్నాయి. కన్ను మూసి తెరిచేలోపు నిండు ప్రాణాలు క్షణాల్లోనే గాల్లో కలిసిపోతున్నాయి. దేశంలో ప్రతి గంటకు 19మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో 4,47,923 వాహనాలున్నాయి. వీటిలో టూ వీలర్ వెహికల్స్ 3,70,789 ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు చెపుతున్నారు. జిల్లాలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో 337మంది చనిపోగా, అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 218 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీస్ శాఖ రికార్డులు చెబుతున్నాయి.

ప్రమాదాల్లో ఎక్కువ శాతం వాహన దారుల నిర్లక్ష్యం కారణంగా జరిగినది అయినప్పటికీ, అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్లు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణాలయ్యాయి. ప్రమాదాల్లో జరిగిన ప్రాణ నష్టం లో స్వయంకృతాపరాధం కొంత అయితే, వ్యవస్థల నిర్లక్ష్యం వాటి లోపాలు కూడా రోడ్డు ప్రమాదాల రూపంలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణాలయ్యాయని చెప్పొచ్చు.

రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు ఎక్కువగా చనిపోయింది ద్విచక్ర వాహనదారులను అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు చాలా మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు రోడ్లపై విపరీతమైన స్పీడు నడిపిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ముఖ్య పాత్ర పోషించే హెల్మెట్ ధారణపై యువత తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుంచి 25 ఏళ్ల లోపు యువకులు మితిమీరిన వాహనాలు నడుపుతూ అనేక సందర్భాల్లో తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదానికి గురి చేసే సందర్భాలు జిల్లాలో అనేకం ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

44వ నంబరు నేషనల్ హైవే పైనే ఎక్కువ ప్రమాదాలు

ఉమ్మడి జిల్లాలోని 44వ నెంబరు జాతీయ రహదారి పైనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ ప్రమాదాలు తెల్ల వారుజామున డ్రైవర్లు మగత నిద్రలో ఉన్నప్పుడు జరుగుతున్నాయి. ఈ సమయంలో వాహనాన్ని వేగంగా నడుపుతున్న క్రమంలో నిద్రమత్తు కమ్మి క్షణంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లోనే ప్రాణ నష్టం ఎక్కువగా సంభవిస్తున్నట్లు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను బట్టి అర్థమవుతోంది.

అధ్వానంగా రహదారులు

జాతీయ రహదారిపై సాధారణంగా ఏ వాహనాలు అతివేగంగా వెళుతుంటాయి. విశాలమైన రోడ్లు మలుపులు లేకుండా ఉన్న జాతీయ రోడ్లు స్పీడ్ డ్రైవింగ్ కు అనువుగా ఉంటాయి. అందుకే వాహన చోదకులు హైవే మీద సాధారణంగా స్పీడుగానే వెళ్తారు. జాతీయ రహదారుల నిర్వహణలో లోపాల కారణంగా హైవేలపై కూడా అక్కడక్కడ గుంతలు, రోడ్ల మధ్యలో పగుళ్లు ఉండడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో కూడా ప్రాణ నష్టం జరిగిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో వాహన చోదకుల పొరపాట్లు లేకపోయినా అధ్వాన్నమైన రోడ్లు కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాతీయ రహదారుల మరమ్మతులపై, వాటి నిర్వహణపై దృష్టి సారించాల్సి ఉన్న, ఒక్కోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలున్నాయి.

మానవ తప్పిదాలు..

రోడ్లపై వాహనాలు మితిమీరిన వేగంతో నడుపుతున్న ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు తలకు బలమైన గాయాలు తగిలి మృత్యువాత పడడం, కోమాలోకి వెళ్లిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవింగ్ చేసే సందర్భాల్లో స్పీడ్ గా వెళ్తున్న వాహనాన్ని పిల్లలు తెలువక స్టీరింగ్ ను అటు ఇటు తిప్పడం కూడా ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గతంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగింది. అప్పటి ప్రమాదంలో ఒకే ఒకే కుటుంబంలోని నలుగురు చనిపోయారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న కుటుంబ యాజమాని, ఆయన ఊళ్లో కూర్చున్న చిన్న పాప కూడా ప్రమాదంలో చనిపోయింది.

నిజామాబాద్ రూరల్ మండలంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో బ్రేక్ డౌన్ అయిన లారీని లారీ యజమాని రెండు రోజులుగా లారీని పక్కకు జరపకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై ఉంచిన తప్పిదానికి ఇద్దరు యువకులు బలి కావలసి వచ్చింది. ఇలా ప్రమాదాలకు వాహన చోదకుల స్వయంకృతాపరాదాలు కారణమైతే, ఇతరుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం కూడా కారణాలుగా మారుతున్నాయి. కారణాలు వ్యక్తులైనా, వ్యవస్థలైనా పదికాలాలపాటు బతకాల్సిన నిండు ప్రాణాలు కన్ను మూసి తెరిచేలోగా గాల్లో కలిసిపోతున్నాయి.


Similar News